Let's talk: editor@tmv.in
బీఆర్ఎస్ బాకీ కార్డు విడుదల చేసిన కాంగ్రెస్

బీఆర్ఎస్ బాకీ కార్డు విడుదల చేసిన కాంగ్రెస్

Aravind Maryada Reddy
2 అక్టోబర్, 2025

తెలంగాణ రాజకీయాల్లో 'బాకీ కార్డు' పేరుతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ బీఆర్ఎస్ బాకీ కార్డు విడుదల చేసి గ్రామాల్లో ప్రచారం చేస్తోంది. అందుకు ప్రతిగా తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డును విడుల చేసింది. 'కేసీఆర్ బాకీ కార్డు'లు అంటూ మంత్రుల వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విడుదల చేశారు. బీఆర్ఎస్ పాలనలో పదేళ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పులు, మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ రాజకీయ వేడి, పంచాయతీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు రెండు పార్టీల మధ్య పోరాటానికి మరింత ఊపందుకుంటోంది.

బీఆర్ఎస్ 'బాకీ కార్డు' ప్రచారం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా గత సెప్టెంబర్ 27న తెలంగాణ భవన్‌లో 'కాంగ్రెస్ బాకీ కార్డు' ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డుల్లో కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు 'గ్యారెంటీలు' రైతులకు రూ.15 వేల రూపాయలు ఎకరానికి సహాయం, రూ.2 లక్షల వ్యవసాయ రుణమాఫీ, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్, వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ.12 వేల సాయం, యువతకు నెలకు రూ.4 వేల నిరుద్యోగ భత్యం, మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500—అమలు కాకుండా పోవడాన్ని 'బాకీ'గా లెక్కించి చూపించారు.

ఏడు వందల రోజులైనా హామీలు అమలు కాలేదు

కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, "100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి 700 రోజులు పూర్తి అయినా కాంగ్రెస్ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇది మోసం, మోసపూరిత గ్యారెంటీ కార్డు!" అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల బాకీ కార్డులు పంపిణీ చేస్తామని ప్రకటించారు. ఈ ప్రచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌లలో అచ్చుచేసి అందరికీ చేరేలా చేశారు. జూబ్లీహిల్స్‌లోనే కేటీఆర్ సమతా కాలనీలో కార్డులు పంచి, ప్రజలకు కాంగ్రెస్ మోసాలు వివరించారు.

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలతో 64 మంది సీట్లు గెలిచి అధికారానికి వచ్చినా, ఇప్పుడు అవి అమలు కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. బీఆర్ఎస్ దీన్ని ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. ముఖ్యంగా, రైతులు, మహిళలు, యువత వంటి ఓటర్ల మనసుల్లో 'బాకీ' మాట పాతుకుపోతే, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు మేలు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

'కేసీఆర్ బాకీ కార్డు'తో కౌంటర్

బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్ మౌనంగా ఉండటం లేదు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 'కేసీఆర్ బాకీ కార్డు'లు విడుదల చేశారు. ఈ కార్డుల్లో బీఆర్ఎస్ హయాంలో 2014-2023 మధ్య రాష్ట్ర అప్పులు రూ.8 లక్షల కోట్లకు చేరడం, మిగులు బడ్జెట్‌తో రాష్ట్ర ఆర్థికాలను దిగజార్చినట్టు ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన కేజీ టు పీజీ ఉచిత విద్య, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ, దళితులకు మూడెకరాలు ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

కాంగ్రెస్ నేతలు ఈ కార్డులతో రాష్ట్రవ్యాప్త ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, "బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల మంటలో ముంచేసింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అమలు చేస్తున్నాం. మిగతా హామీలు క్రమంగా అమలవుతాయి" అని చెప్పారు. బీఆర్ఎస్ హామీలపై దృష్టి సారించడం వల్ల కాంగ్రెస్ తమ హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటున్నదన్న విమర్శలు వస్తున్నాయి.

ఎవరు మోసం చేశారు?

ఈ 'బాకీ కార్డు' ఉద్యమాన్ని అన్ని కోణాల్లో విశ్లేషిస్తే ఎవరు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారో అర్థమవుతుంది. అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. అయితే హామీలు అమలు చేయని విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉందని చెప్పొచ్చు. కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, 22 నెలల తర్వాత కూడా నిరుద్యోగ భృతి, మహిళలకు నెలనెలకు రూ. 2500, కల్యాణలక్ష్మిలో తులం బంగారం, రైతు కూలీలు, కౌలు రైతులకు ఎందుకు సాయం చేయడం బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తోంది. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.

జనం ఏమనుకుంటున్నారు?

ప్రజల కోణం నుంచి చూస్తే, రైతులు, మహిళలు, యువతలో అసంతృప్తి పెరుగుతోంది. బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల కోట్ల అప్పులు పెరిగినా, ఆ పాలనలో రైతు భరోసా, షెడ్యూల్డ్ కులాలకు రూ.1 లక్ష సహాయం వంటివి అమలయ్యాయి. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే కొన్ని పథకాలు (ఇందిరమ్మ ఇళ్లు, గ్రామ జ్యోతి) మొదలైనా, పెద్ద హామీలు ఆలస్యం కారణంగా ప్రజల్లో నిరాశ కలుగుతోంది. ఈ రెండు పార్టీల మధ్య ఆరోపణలు ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి.

ఎన్నికల ముందు 'బాకీ' ఆయుధం

పంచాయతీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు ఈ 'బాకీ కార్డు' ప్రచారాలు రెండు పార్టీల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బీఆర్ఎస్ దీన్ని ఉపయోగించుకుని కేసీఆర్‌కు మళ్లీ రాజకీయ ఆక్సిజన్ సరఫరా చేసుకోవాలని చూస్తోంది. కాంగ్రెస్ వైపు, ఈ ప్రతీకార కార్డులతో బీఆర్ఎస్ పాత తప్పులను గుర్తు చేస్తోంది. "ఈ 'బాకీ' కార్డు ఉద్యమంతో ప్రజలకు నిజాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించి ఇబ్బడిముబ్బడిగా హామీలను అమలు ఇస్తాయి. కానీ అధికారంలోకి వచ్చాక సహజంగా వాటిని మరిచిపోతూ ఉంటాయి. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

బీఆర్ఎస్ బాకీ కార్డు విడుదల చేసిన కాంగ్రెస్ - Tholi Paluku