Let's talk: editor@tmv.in
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి విమర్శలు

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై కిషన్ రెడ్డి విమర్శలు

Gaddamidi Naveen
18 అక్టోబర్, 2025

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గడచిన పది సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి జరగలేదని, సమస్యలు అలాగే పేరుకుపోయాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి జరగకపోగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని ఆయన ఆరోపించారు.

అభివృద్ధి సమస్యలు యథాతథం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రధాన సమస్యలు అలాగే ఉన్నాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. "గత పది ఏళ్లల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందలేదు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఏమీ మారలేదు. అవే డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సమస్యలు, ధ్వంసమైన రోడ్లు, రోడ్ల మీద చెత్త – ఇలా అన్నీ సమస్యలే" అని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ప్రాథమిక మౌలిక వసతుల కోసం ఇంకా ఇబ్బందులు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

మజ్లిస్ పార్టీ మోచేతి కింద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప‌ని చేస్తుందన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఉప ఎన్నిక‌ల్లో రాజకీయ వ్యవహారాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పరోక్షంగా మజ్లిస్ పార్టీయే నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేయడంలో కూడా మజ్లిస్ పార్టీ పాత్ర ఉందని ఆయన విమర్శించారు.

అప్పుడు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ వీరంతా మజ్లిస్ పార్టీని తమ భుజాల మీద మోస్తున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రెండు జాతీయ స్థాయి పార్టీలు, రాష్ట్రంలోని అధికార పార్టీలు యొక్క రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రిపై పరోక్ష విమర్శ

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు కేవలం ఎన్నికల రాజకీయాల కోసం, మజ్లిస్‌తో లోపాయికారీ అవగాహన కోసం ప్రజల అభివృద్ధి సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేయడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకే దారిలో నడుస్తున్నాయని, జూబ్లీహిల్స్‌లో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం రాష్ట్రంలో అభివృద్ధిని పట్టించుకోకుండా, మజ్లిస్ పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆయన పరోక్షంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలకు ఎక్కుపెట్టారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా మహిళలకు నెలకు రూ.2,500, విద్యార్థినులకు స్కూటీలు, పెళ్లయిన యువతులకు తులం బంగారం ఇవ్వాలని హామీ ఇచ్చింది. అయితే ఈ హామీలలో ఏదీ అమలు కాలేదన్నారు. ఈ హామీలన్నీ కేవలం ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే కాంగ్రెస్ ప్ర‌క‌టిస్తుంద‌ని మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

ఈ విమర్శలు జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఎత్తిచూపడంతో పాటు, తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు మజ్లిస్‌తో కొనసాగిస్తున్న సంబంధాలపైనా కొత్త చర్చకు తెర తీశాయి.