Let's talk: editor@tmv.in
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సంక్షేమం పునరుద్ధరణ హామీ: హ‌రీష్ రావు

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సంక్షేమం పునరుద్ధరణ హామీ: హ‌రీష్ రావు

Gaddamidi Naveen
5 ఫిబ్రవరి, 2026

పటాన్‌చెరువు నియోజకవర్గం గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో మాజీ మంత్రి, హరీష్ రావు పర్యటించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గ్రామంలో పర్యటిస్తూ స్థానికులతో, ముఖ్యంగా మహిళలతో ముచ్చటించారు. గ్రామంలోని మహిళల సమస్యలను అడిగి తెలుసుకుని, వారి ఆవేదనలను విన్నారు.

ఈ సందర్భంగా మాదారం గ్రామానికి చెందిన మహిళలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలైన అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు అందడం లేదని వారు వాపోయారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు కావడం లేదని, ప్రజలను మోసం చేస్తున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళలతో జరిగిన చర్చలో హరీష్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. పేదలు, మహిళలు, రైతులు, కార్మికుల కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చి నేరుగా లబ్ధి చేకూర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మాయమాటలతో ప్రజలను మోసం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. అలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తామని, అభివృద్ధి పథంలో పట్టణాలను ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.