Let's talk: editor@tmv.in
బీఆర్ఎస్‌‌కు ఆశించిన స్థానాలు రాలేదు: కేటీఆర్

బీఆర్ఎస్‌‌కు ఆశించిన స్థానాలు రాలేదు: కేటీఆర్

Gaddamidi Naveen
15 ఫిబ్రవరి, 2026

మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేస్తూనే, బీఆర్ఎస్ శ్రేణుల పోరాటాన్ని అభినందించారు.

వెల్లడైన ఫలితాలతో బీఆర్ఎస్ సంతృప్తికరమైన పోరాటం చేసిందని, మేము 30 మున్సిపాలిటీలు వస్తాయని భావించాం. అయితే ముందుగా ఆశించిన స్థాయిలో స్థానాలు రాలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూడా పూర్తిగా సంతోషంగా లేదని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యకర్తలు కష్టపడి పోరాడి 17 మున్సిపాలిటీలను సాధించారని, హంగ్ పరిస్థితి ఉన్న ప్రాంతాల్లో కూడా తమకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

బీజేపీ తమ ప్రదర్శన బాగుందని చెప్పుకోవడం అర్థం కావడం లేదని కేటీఆర్ విమర్శించారు. గత ఎన్నికలతో పోలిస్తే వారికి తక్కువ ఓట్లు, తక్కువ వార్డులు వచ్చాయని ఆయ‌న చెప్పారు. జాతీయ స్థాయి నాయకులు ప్రచారం చేసినప్పటికీ ఒక్క మున్సిపాలిటీ కూడా గెలవలేకపోయారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సమస్యలే ప్రధానమని, అధికారంలో ఉన్న పార్టీకే సాధారణంగా అనుకూల పరిస్థితులు ఉంటాయని కేటీఆర్ అన్నారు.

ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఎక్కువగా కనిపించిందని, కాంగ్రెస్ విపరీతంగా ఖర్చు చేసిందని ఆయ‌న‌ ఆరోపించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ గెలిచిన స్థానాల సంఖ్యను ప్రజలు గుర్తు పెట్టుకున్నారని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను కూడా ప్రస్తావించారు.

ఎక్స్ అఫీషియో సభ్యుల నిబంధనల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని, అధికారులు భిన్నంగా మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. ఫార్ములా ఈ అంశాన్ని మళ్లీ ముందుకు తెస్తున్నారని, ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరైనప్పటికీ కొత్తగా ఏమీ బయటపడలేదని ఆయ‌న తెలిపారు. ఎన్ని విచారణలు జరిగినా తాము సహకరిస్తామని, నిజం చెప్పడంలో భయం లేదని పేర్కొన్నారు. చివరకు జైలుకు పంపించినా భయపడేది లేదని, ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవని అవినీతి నిరోధక సంస్థ అధికారులు ఇప్పటికే తెలిపినట్లు కేటీఆర్ చెప్పారు.