Let's talk: editor@tmv.in
బిహార్‌లో ఐపీఎస్ అధికారి అరెస్ట్: రఘురామ కస్టడీ కేసులో కీలక మలుపు

బిహార్‌లో ఐపీఎస్ అధికారి అరెస్ట్: రఘురామ కస్టడీ కేసులో కీలక మలుపు

Panthagani Anusha
24 ఫిబ్రవరి, 2026

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కస్టడీ హింస కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి బిహార్ ఐజీ సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు సోమవారం బిహార్‌లో అరెస్ట్ చేశారు. గతంలో ఏపీ సీఐడీలో డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ప్రస్తుతం బిహార్‌లో ఐజీ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.

కేసు నేపథ్యం

2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణ రాజు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసిన సీఐడీ పోలీసులు, హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు. ఆ సమయంలో కస్టడీలో ఉన్న తనను పోలీసులు అమానుషంగా హింసించారని, కాళ్లపై బూట్లతో తన్నారని రఘురామ అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్ మిలిటరీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా, ఆయన కాళ్లపై గాయాలు ఉన్నట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది.

కూటమి ప్రభుత్వంలో వేగవంతమైన విచారణ

2024 ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసుపై విచారణ ఊపందుకుంది. తనను కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా చంపేందుకు ప్రయత్నించారంటూ రఘురామకృష్ణ రాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి సీఐడీ కీలక అధికారులు పి.వి. సునీల్ కుమార్, సునీల్ నాయక్, విజయ్ పాల్‌లతో పాటు మాజీ సీఎం జగన్‌పై కూడా హత్యాయత్నం (సెక్షన్307) సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం అరెస్ట్ అయిన సునీల్ నాయక్‌ను నేడు గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఈ కేసులో మరికొందరు అధికారులపై కూడా వేటు పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఐపీఎస్ స్థాయి అధికారిని మరో రాష్ట్రంలో అరెస్ట్ చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.