
బిహారీలను మోసం చేయలేరు: తేజస్వీ యాదవ్
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజురోజుకి మరితం ముదురుతోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయంగా వాతావరణాన్ని వేడేక్కిస్తున్నారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఇటీవల ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో చేసిన వ్యాఖ్యలపై తేజస్వీ మండిపడ్డారు. బీహార్ అభివృద్ధిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు మోసపూరితమైనవని ఆయన ఆరోపించారు. బీహార్‌లో ఇప్పటివరకు 20 ఏళ్లపాటు పాలించిన తర్వాత కూడా హోం మినిస్టర్ సాకులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలు గుజరాత్‌లో పెడతామంటారు. కానీ అక్కడ కార్మికులు మాత్రం బీహార్ వారే అంటారు. ఇక బీహారీలు ఈ మోసాలకు బలి కారని తేజస్వీ యాదవ్ సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్ లో షా వ్యాఖ్యల వీడియోను షేర్ చేశారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే ఈ 20 ఏళ్ల పాలనలో ఉన్న చీకట్లను తొలగించి అందరికీ ఉపాధి కల్పిస్తామన్నారు. నిరుద్యోగాన్ని తొలగిస్తామన్నారు.
అమిత్ షా ఇంటర్వ్యూలో ఏమన్నారంటే
బీహార్‌లో పెద్ద పరిశ్రమలు స్థాపించడానికి భూమి కొరత ప్రధాన అడ్డంకిగా ఉంది. అందుకే బీహార్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌గా, సాఫ్ట్‌వేర్ పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము యోచిస్తున్నాం అని వివరించారు. సీఎం నితీశ్ నేతృత్వంలోనే ఈ ఎన్నికల్లో ముందుకుపోతున్నామని, గెలిచిన అనంతరం గెలిచిన అభ్యర్థుల నిర్ణయం ప్రకారం సీఎం ను ఎన్నుకుంటామని తెలిపారు. అలాగే బీహార్ లో ఇంటింటికి ఉద్యోగం ఎలా ఇస్తారు. ఆర్జేడీ సాధ్యం కానీ హామీలు ఇస్తుందని, ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఇటీవల ప్రవేశపెట్టిన మహిళా ముఖ్యమంత్రి రోజ్ గార్ యోజనపై కూడా అమిత్ షా మాట్లాడారు. మహిళలు తమ వ్యాపారంలో వృద్ధి సాధిస్తే బ్యాంక్ నుంచి రూ.2 లక్షలు ఇప్పిస్తామన్నారు. బీహార్ లో విమానాశ్రయాలు, ప్రాజెక్టులు, విద్యుత్, ప్రతి ఇంటికి తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. లాలూ పాలనలో ఇవన్నీ జరిగాయా? అని ప్రశ్నించారు. 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ కనీసం మరుగుదొడ్డి కూడా నిర్మించలేదన్నారు. మా హయాంలో అభివృద్ధి జరగలేదంటే పట్నాలోని చౌరస్తాలో మమ్మల్ని నిలబెట్టి అడగండి అని అమిత్ షా సవాల్ విసిరారు. నితీశ్ హయాంలో అభివృద్ధి జరిగిందని ప్రశంసించారు.
అదే సమయంలో అమిత్ షా పట్నాలో జరిగిన ఇంటెలెక్చువల్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఇప్పుడు బిహార్ 3.0 సమయం వచ్చింది. ప్రపంచంలోనే బీహార్ యువత అత్యంత తెలివైనవారన్నారు. భూమి కొరత ఉన్నా మానసిక శక్తి ఆధారిత పరిశ్రమలను బిహార్‌లో ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా అమిత్ షా లాలూ పాలనపై కూడా విరుచుకుపడ్డారు. లాలూ–రబ్రీ పాలనలో బీహార్‌లో 15 ఏళ్ల పాటు జంగిల్ రాజ్ సాగిందని, దీంతో అభివృద్ధి సగం శతాబ్దం వెనక్కి నెట్టిందన్నారు. ఆ కాలంలో రాష్ట్రం తన గౌరవాన్ని, శోభను, ప్రతిష్ఠను కోల్పోయిందని ఆరోపించారు. లాలూ పాలనలో రాష్ట్రం ఏవిధంగా ఉండేదో ఇంట్లో ఉన్న మీ పెద్దలను అడగండి. ప్రతి అంశంలో బీహార్ ను వెనక్కినెట్టేశారు. లాలూ కేంద్రంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న ప్రతి దగ్గర అవినీతి, హత్యలు, స్కాంలు చేశారని విమర్శించారు. మళ్లీ వారే కొత్త రూపంలో, కొత్త వేషాలు వేస్తూ రాష్ట్రంలో ఓట్లడుగుతున్నారు. గతంలో 6 దశల్లో ఎన్నికలు జరిగేవని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. కానీ అప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉండేవో అందరికీ తెలుసన్నారు. ప్రస్తుతం నక్సలిజంను, రౌడీ షీటర్లను అంతం చేశామని అందుకే 2 దశల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు.
143 సీట్లలో పోటీ చేస్తున్న ఆర్జేడీ
మహాఘట్భంధన్ నుంచి రాష్ట్రీయ జనతా దళ్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 243 స్థానాల్లో ఆర్జేడీ 143, కాంగ్రెస్ 61, సీపీఐ (ఎంఎల్) 20 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది.
