Let's talk: editor@tmv.in
బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్ర సంస్థ‌గా ప్ర‌క‌టించిన కెన‌డా!

బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్ర సంస్థ‌గా ప్ర‌క‌టించిన కెన‌డా!

Venkatesh Balusula
30 సెప్టెంబర్, 2025

హ‌త్య‌లు, నేరాల‌తో ప్రపంచ‌వ్యాప్తంగా మార్మోగిన బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెన‌డా ప్ర‌భుత్వం ఉగ్ర‌సంస్థ‌గా ప్ర‌క‌టించింది. బిష్ణోయ్ గ్యాంగ్ వల్ల కొన్ని ప్రత్యేక సముదాయాలు ఉగ్రవాదం, హింస, బెదిరింపులకు గురవుతున్నాయ‌ని పేర్కొంది. ఈ క్రిమినల్ ఉగ్రవాదుల సమూహాన్ని ఉగ్ర సంస్థగా గుర్తించ‌డం వ‌ల్ల వారి నేరాలను ఎదుర్కొని ఆపడానికి బలమైన స‌హ‌కారం పొందుతామ‌ని ప్ర‌జా ర‌క్ష‌ణ‌ మంత్రి గ్యారీ అనందసంగరీ ఒక ప్రకటనలో చెప్పారు. కెనడాలో బిష్ణ‌య్ గ్యాంగ్‌ను ఉగ్ర సంస్థగా గుర్తించ‌డం వ‌ల్ల‌ ఫెడరల్ ప్రభుత్వానికి ఆ గ్యాంగ్‌కు సంబంధించిన‌ ఆస్తులు, వాహనాలు, డబ్బులను ఫ్రీజ్ చేసే, స్వాధీనం చేసుకునే అధికారం వస్తుంద‌న్నారు.

బిష్ణోయ్ గ్యాంగ్ భారత మూలాలు క‌లిగి ఉన్న సంస్థ‌. ఇది భార‌త్‌ నుంచి అంతర్జాతీయంగా నేర కార్య‌కలాపాలు నిర్వ‌హించింది. లారెన్స్ బిష్ణోయ్ దీనికి ప్రధాన నాయకుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు బిష్ణోయ్ గ్యాంగ్ ప‌లు హత్యలు, కాల్పులు, బెదిరింపుల‌కు పాల్ప‌డింది. వ్య‌క్తుల‌ను బెదిరించి డ‌బ్బులు వ‌సూలు చేయ‌డంలో ఈ గ్యాంగ్ స‌భ్యులు సిద్ధ‌హ‌స్తులు. భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలో బిష్ణోయ్ గ్యాంగ్‌కు బలమైన పట్టుంది. కెనడా, అమెరికాలో భారతీయ వ‌ర్గాలుండే ప్ర‌దేశాల్లో కూడా కార్యకలాపాలు నడుపుతున్నారు. ఈ గ్యాంగ్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నట్టు 2024లో కెనడా అధికారులు ఆరోపించారు.

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల‌తో ప్ర‌సిద్ధి

బిష్ణోయ్ గ్యాంగ్ ప్రసిద్ధ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డ్డారు. 1998లో రాజస్థాన్‌లో జరిగిన ఓ ప్ర‌త్యేక‌మైన‌ జింకల వేట‌ కారణంగా ఇది మొద‌లైంది. బిష్ణోయ్‌ సముదాయంలో స‌ద‌రు జింక‌ల‌ను పవిత్రంగా భావిస్తారు. సల్మాన్ ఖాన్‌ దాన్ని కాల్చాడన్న ఆరోప‌ణ‌లున్నాయి. ఈ కారణంగా బిష్ణోయ్‌ గ్యాంగ్ వాళ్లు సల్మాన్‌ను చంపేస్తామ‌ని ఎన్నోసార్లు బెదిరించారు. 2018లో బిష్ణోయ్ గ్యాంగ్‌ సల్మాన్‌ను జోధ్‌పూర్‌లో చంపేస్తామని బెదిరించారు. త‌ర్వాత సైతం ప‌లు మార్లు బెదిరింపులు కొన‌సాగాయి. గ‌తేడాది ఏప్రిల్‌లో ముంబైలో సల్మాన్ ఇంటి ముందు కాల్పులు జ‌రిగాయి. 2024 అక్టోబర్‌లో మహారాష్ట్ర మంత్రి బాబా సిద్దీఖ్‌ని హత్య చేశారు. అత‌డు సల్మాన్ స్నేహితుడు కాబట్టి హ‌త్య చేశామ‌ని బిష్ణోయ్ గ్యాంగ్ ప్ర‌క‌టించింది.

ఈ బెదిరింపులతో సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ పెంచుకున్నారు. మ‌హారాష్ట్ర‌ ప్ర‌భుత్వం సైతం ప్ర‌త్యేకంగా పోలీస్‌ ఆఫీసర్ల‌తో ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ, స‌ల్మాన్ ఖాన్ ఇంటి వ‌ద్ద‌ ఏఐ సీసీటీవీలు ఏర్పాటు చేశారు. ప్ర‌ముఖ హాస్య న‌టుడు క‌పిల్ శ‌ర్మ‌కు చెందిన కేఫ్‌పై కెన‌డాలో బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు చేసింది. ఈ ఘ‌ట‌న అటు కెన‌డాతో పాటు భార‌త్‌లో తీవ్ర దుమారం రేపింది. కెన‌డా ప్ర‌భుత్వ నిర్ణ‌యం బిష్ణోయ్ గ్యాంగ్ కార్యకలాపాలను బలంగా అడ్డుకుంటుంది. భారతదేశంలో ఈ గ్యాంగ్‌పై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. కెన‌డా నిర్ణ‌యంతో అంతర్జాతీయంగా వాళ్ల ఆర్థిక కార్య‌కలాపాల‌పై దెబ్బతీస్తుంది. ఫ‌లితంగా బిష్ణోయ్ గ్యాంగ్ అకృత్యాల‌కు అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్ర సంస్థ‌గా ప్ర‌క‌టించిన కెన‌డా! - Tholi Paluku