Let's talk: editor@tmv.in
బిల్ గేట్స్ పర్యటన కేవలం ప్రచార ఆర్భాటమే: వైసీపీ నేత సుధాకర్ బాబు

బిల్ గేట్స్ పర్యటన కేవలం ప్రచార ఆర్భాటమే: వైసీపీ నేత సుధాకర్ బాబు

Panthagani Anusha
17 ఫిబ్రవరి, 2026

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఉద్దేశ్యం, దాని ఔచిత్యాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలోని తీవ్రమైన సమస్యలను గాలికొదిలేసి కేవలం గ్రాఫిక్స్ ప్రచారంపైనే దృష్టి సారిస్తోందని ఆరోపించింది. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.

రాజధాని ఎక్కడ? ప్రయోజనం ఏమిటి?

బిల్ గేట్స్ పర్యటన వల్ల రాష్ట్ర ప్రజలకు చేకూరే స్పష్టమైన ప్రయోజనం ఏమిటని సుధాకర్ బాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత పదేళ్లుగా ఐకానిక్ టవర్లు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాల డిజైన్లను గ్రాఫిక్స్ రూపంలో టీవీల్లో చూపిస్తున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతి లేదని విమర్శించారు. బిల్ గేట్స్ ఏ హోదాలో అమరావతిని సందర్శించారు? అసలు రాజధాని ఎక్కడ ఉంది? అని ఆయన నిలదీస్తూ మౌలిక సదుపాయాలు లేకుండానే విదేశీ ప్రముఖుల పర్యటనలతో ప్రభుత్వం కాలక్షేపం చేస్తోందని మండిపడ్డారు.

హాస్టళ్లలో 'కాటు' వేస్తున్న సమస్యలు

రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల దుస్థితిపై సుధాకర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. గత 14 నెలల్లో దాదాపు 900 మంది విద్యార్థులు కలుషిత ఆహారం, అనారోగ్యం కారణంగా ఆసుపత్రుల పాలయ్యారని ఒక జాతీయ దినపత్రిక నివేదికను ఆయన ఉటంకించారు. విద్యార్థులు ఎలుకల కాటుకు గురవుతుంటే ఆహార నాణ్యత అధ్వాన్నంగా ఉంటే పట్టించుకోని ప్రభుత్వం బిల్ గేట్స్ కు ఆతిథ్యం ఇవ్వడంలో ఉన్న శ్రద్ధను ప్రజా సమస్యలపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంగానే ఈ పర్యటన కనిపిస్తోందని ఆరోపించారు.

ముఖ్యమంత్రికి, మంత్రులకు బహిరంగ సవాల్

ఈ సందర్భంగా ప్రభుత్వానికి సుధాకర్ బాబు ఒక సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ ను ఒక సాంఘిక సంక్షేమ హాస్టల్‌కు తీసుకెళ్లి, అక్కడ విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనాన్ని ఆయన చేత తినిపించాలని డిమాండ్ చేశారు. అది కూడా ముందస్తు ఏర్పాట్లు లేకుండా, ఆకస్మిక తనిఖీలా జరగాలని అప్పుడే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ కుమారులను అటువంటి హాస్టళ్లకు తీసుకెళ్లి అక్కడ వడ్డించే ఆహారాన్నే తినిపించాలని డిమాండ్ చేశారు.

ప్రజల సొమ్ముతో నడుస్తున్న హాస్టళ్లలో జవాబుదారీతనం ప్రదర్శించడంలో ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోందని పార్టీ ప్రశ్నించింది. కేవలం గ్రాఫిక్స్ తో గారడీ చేయడం మానుకోవాలని చర్యల ద్వారా పారదర్శకతను చూపాలని హితవు పలికింది.