Let's talk: editor@tmv.in
బిలియ‌నీర్ క్ల‌బ్ లోకి షారుక్ ఖాన్

బిలియ‌నీర్ క్ల‌బ్ లోకి షారుక్ ఖాన్

FL - BRTH
2 అక్టోబర్, 2025

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ షారుక్ ఖాన్ అధికారికంగా బిలియ‌నీర్ క్ల‌బ్ లోకి ప్రవేశించారు. రూ. 12490 కోట్ల సంప‌ద‌తో ఎం3ఎం హ‌రూన్ ఇండియా రిచ్ లిస్ట్ లోకి చేరిపోయారు. షారుక్ ఖాన్ ను హరూన్ బిలియ‌నీర్ గా గుర్తించ‌డం ఇదే మొద‌టిసారి. 2025 సంవ‌త్స‌రం షారుక్ ఖాన్ కు బాగా క‌లిసొచ్చింద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఎందుకంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్న జాతీయ అవార్డును ఇదే ఏడాదిలో గెలుచుకున్నారు. దీంతో పాటు బిలియ‌నీర్ లిస్ట్ లోకి చేరిపోయారు. అందుకే 2025 షారుక్ బెస్ట్ ఇయ‌ర్ అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

షారుక్ ఖాన్ బిలియ‌నీర్ లిస్ట్ లో చేర‌డానికి ప్ర‌ధాన కార‌ణం మాత్రం ఆయ‌న స్థాపించిన రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ‌. గ‌త ఇర‌వై ఏళ్లుగా ఈ సంస్థ చాలా విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను నిర్మించింది. వీఎఫ్ఎక్స్, డిజిట‌ల్ వెంచ‌ర్స్ లో పెట్టుబడులు పెట్టింది. దాదాపు 500 మంది ఉద్యోగుల‌తో రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ కొన‌సాగుతోంది. భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌లో అత్యంత లాభ‌దాయ‌క‌మైన సంస్థ‌గా రెడ్ చిల్లీస్ ఎంట‌ర్టైన్మెంట్స్ సంస్థ ఉంది.

షారుక్ సంప‌ద‌లో రియ‌ల్ ఎస్టేట్ కూడా ప్ర‌ధాన భాగం. ముంబైలోని బాంద్రాలో ఉన్న ఆయ‌న ఇంటి విలువ దాదాపు రూ. 200 కోట్ల‌పైనే ఉంటుంద‌ని అంచ‌నా. లండ‌న్, ఢిల్లీ, దుబాయ్, ఇంగ్లండ్ లో షారుక్ ఖాన్ కు ఆస్తులు ఉన్నాయి. బీఎండ‌బ్ల్యూ, రోల్స్ రాయిస్, మెర్సిడెస్, ఆడిస్ వంటి వివిధ టాప్ బ్రాండ్ కార్లు ఆయ‌న వ‌ద్ద ఉన్నాయి. షారుక్ వ‌ద్ద ఉన్న బుగ‌ట్టి వెయ్రాన్ కిరిటం విలువ దాదాపు రూ. 12 కోట్లు. ఒక‌ప్పుడు జేబులో రూ.1500తో ముంబైకి వ‌చ్చాన‌ని చెప్పిన షారుక్ ఖాన్.. ఇప్పుడు బిలియ‌నీర్ గా మార‌డం ఆయ‌న కృషి, ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నం.

బిలియ‌నీర్ క్ల‌బ్ లోకి షారుక్ ఖాన్ - Tholi Paluku