Let's talk: editor@tmv.in
బిలాస్‌పూర్ లో రైలు ప్రమాదం

బిలాస్‌పూర్ లో రైలు ప్రమాదం

Pinjari Chand
5 నవంబర్, 2025

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సంభవించిన ఘోర రైలుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని జిల్లా కలెక్టర్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. వివరాల ప్రకారం బిలాస్ పూర్ సమీపంలో ఒక స్థానిక మెము రైలు చివరి బోగీ, గూడ్స్ రైలు ముందు బోగీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు బోగీలో చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. లోకల్ ట్రైన్, గూడ్స్ రైలు బోగీలు ఢీకొన్నాయి. ఇప్పటివరకు నలుగురు మృతి చెందినట్లు, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ అగర్వాల్ చెప్పారు.

ఈ ఘటనపై ఇన్‌స్పెక్టర్ జనరల్ సంజీవ్ శుక్లా మాట్లాడుతూ ఒక వ్యక్తి రైలు బోగీలో చిక్కుకున్నాడు. అతనిని కాపాడేందుకు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పలువురు గాయపడ్డారని వివరించారు. రైల్వే అధికారులు ప్రమాద స్థలంలో సహాయక బృందాలను మోహరించారు. గాయపడిన వారికి సమీప ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ప్రమాదంపై రైల్వే భద్రతా కమిషనర్‌ స్థాయిలో దర్యాప్తు జరిపి, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకుంటామని రైల్వేశాఖ తెలిపింది.

రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

ఈ ఘటనలో బాధితులకు రైల్వే శాఖ ఆర్థిక సహాయం ప్రకటించింది . మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం,

తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు.

హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల

ఘటన స్థలం వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు, ప్రయాణికులకు సాయం కోసం సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది.

చాంపా జంక్షన్: 808595652

రాజ్‌గఢ్: 975248560

పేంద్ర రోడ్: 8294730162

ప్రమాద స్థలం హెల్ప్‌లైన్ నంబర్లు: 9752485499, 8602007202. రైల్వే అధికారులు, పోలీసు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యారు. చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇన్‌స్పెక్టర్ జనరల్ సంజీవ్ శుక్లా తెలిపారు. రైల్వే అధికారులు పరిస్థితిని నిశితంగా ఘటన స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తామని తెలిపారు.

ఇటీవల జరిగిన ప్రధాన రైలు ప్రమాదాలు (2021 తర్వాత)

2023లో జూన్ 2న

ఒడిశా రాష్ట్రం బాలసోర్ దగ్గర కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్ రైలు ఢీకొని 296 మంది ప్రయాణికులు మరణించారు. (20 ఏళ్లలోనే అత్యంత ఘోర ప్రమాదం). 2022 జనవరిలో పంజాబ్ లోని

జలంధర్ దగ్గర పాసింజర్ రైలు ఇంజిన్ డెరైల్మెంట్ ఢీకొని ఒకరు మరణించారు. 2021 డిసెంబర్లో

గువాహటి–బికనీర్ ఎక్స్‌ప్రెస్‌, జల్పాయ్‌గుడి పశ్చిమ బెంగాల్ ఎక్స్ప్రెస్లో 12 బోగీలు పట్టాలు తప్పి 9 మంది చనిపోయారు. సోషల్ మీడియాలో కేంద్ర రైల్వే మంత్రి రాజీనామా చేయాలని ట్రెండింగ్ నడుస్తోంది.