Let's talk: editor@tmv.in
బిర్లా కన్సార్టియం మెగా డీల్.. రూ.16,700 కోట్లకు ఆర్‌సీబీ కైవసం

బిర్లా కన్సార్టియం మెగా డీల్.. రూ.16,700 కోట్లకు ఆర్‌సీబీ కైవసం

Shaik Mohammad Shaffee
26 మార్చి, 2026

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) యాజమాన్యం మారింది. సుదీర్ఘ కాలంగా ఈ జట్టును నడిపిస్తున్న యూనైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్), తన పూర్తి 100 శాతం వాటాను ఆదిత్య బిర్లా గ్రూప్ (ఏబీజీ) నేతృత్వంలోని కన్సార్టియానికి విక్రయించింది. ఈ భారీ డీల్ విలువ అక్షరాలా 1.78 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.16,700 కోట్లు) కావడం విశేషం. ఈ మేరకు మంగళవారం జరిగిన యూనైటెడ్ స్పిరిట్స్ బోర్డు సమావేశంలో విక్రయ ఒప్పందానికి ఆమోదం ముద్ర పడింది.

కన్సార్టియంలో హేమాహేమీలు

ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని ఈ కూటమిలో మరికొన్ని దిగ్గజ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. అమెరికన్ ఇన్వెస్టర్ డేవిడ్ బ్లిట్జర్‌కు చెందిన 'బోల్ట్ వెంచర్స్', వైరల్ పటేల్ సీఈఓగా ఉన్న 'బ్లాక్‌స్టోన్', ప్రముఖ మీడియా సంస్థ 'టైమ్స్ ఆఫ్ ఇండియా' గ్రూప్‌లు ఈ కొనుగోలులో కీలక పాత్ర పోషించాయి. ఈ నగదు లావాదేవీ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిధిలోని పురుషుల (ఐపీఎల్), మహిళల (డబ్ల్యూపీఎల్) జట్ల యాజమాన్య హక్కులు కొత్త గ్రూపునకు బదిలీ కానున్నాయి.

వ్యాపార వ్యూహంలో భాగంగానే విక్రయం

యూకేకు చెందిన డియాజియో అనుబంధ సంస్థ అయిన యూనైటెడ్ స్పిరిట్స్, తమ ప్రధాన వ్యాపారమైన ఆల్కహాల్ రంగంపై దృష్టి సారించేందుకే ఆర్‌సీబీని విక్రయించాలని నిర్ణయించుకుంది. 2025 నవంబర్ నుంచే ఈ వ్యూహాత్మక సమీక్ష ప్రారంభమైనట్లు సంస్థ తెలిపింది. ఆర్‌సీబీని ఒక విజయవంతమైన బ్రాండ్‌గా తీర్చిదిద్దామని, క్రీడారంగం వృద్ధి చెందుతున్న తరుణంలో కొత్త యాజమాన్యం జట్టును మరింత ముందుకు తీసుకెళ్తుందని యూఎస్ఎల్ ఎండీ ప్రవీణ్ సోమేశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

కొత్త చైర్మన్‌గా ఆర్యమాన్ విక్రమ్ బిర్లా

ఈ ఒప్పందం ప్రకారం, ఆదిత్య బిర్లా గ్రూప్ డైరెక్టర్ ఆర్యమాన్ విక్రమ్ బిర్లా ఆర్‌సీబీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సత్యన్ గజ్వానీ డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. "ఐపీఎల్ ప్రపంచ క్రీడారంగంలోనే ఒక అద్భుతం. ఆర్‌సీబీ వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్‌ను నడపడం గర్వంగా ఉంది" అని కుమార మంగళం బిర్లా పేర్కొనగా, అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా జట్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని ఆర్యమాన్ బిర్లా, సత్యన్ గజ్వానీ ధీమా వ్యక్తం చేశారు.

ఖరీదైన జట్లుగా ఆర్‌సీబీ, ఆర్ఆర్

ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టును అమెరికాకు చెందిన కల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం 1.63 బిలియన్ డాలర్లకు (రూ. 15,290 కోట్లు) కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆర్‌సీబీ డీల్ అంతకంటే ఎక్కువ ధరకు ముగియడం గమనార్హం. కాగా ఈ విక్రయ ప్రక్రియ పూర్తి కావాలంటే బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుంచి తుది అనుమతులు లభించాల్సి ఉంది.

బిర్లా కన్సార్టియం మెగా డీల్.. రూ.16,700 కోట్లకు ఆర్‌సీబీ కైవసం - Tholi Paluku