Let's talk: editor@tmv.in
బిగ్ బాస్ హౌస్ లో ట్రోఫీ గెలిచే అర్హులెవరు ?

బిగ్ బాస్ హౌస్ లో ట్రోఫీ గెలిచే అర్హులెవరు ?

Thaduri Lalitya
7 డిసెంబర్, 2025

బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. టాస్కులు, సెలవులు అన్నీ పక్కన పెడితే ఆట మొదటిలో నెమ్మదిగా కొనసాగినా, ముందుకుసాగే కొద్దీ కంటెస్టెంట్లలో పోటీ పెరిగింది, కొత్త కొత్త టాస్కులతో ఆట రసవత్తరంగా మారింది. ఈ సీజన్‌లో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కో దారి. అలా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ లో బెస్ట్ పెర్ఫార్మర్ గా ఇమాన్యుయెల్ పేరు ముందుంటుంది. ఇటీవల జరిగిన మ్యాథ్స్ టాస్క్‌లో కాన్వెంట్, ఇంగ్లీష్ మీడియం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్స్ అందర్నీ వెనక్కి నెట్టేస్తూ… జిల్లా పరిషత్ స్కూల్, తెలుగు మీడియం విద్యార్థుల ప్రతిభను ప్రపంచానికి రుజువు చేశాడు.

అతను చెప్పిన లెక్కల స్పీడు, కాన్ఫిడెన్స్ చూసి హోస్ట్ నాగార్జున కూడా చిరునవ్వులు చిందించకుండా ఉండలేకపోయారు. శనివారం అంటే హౌస్ మేట్స్ కు ఫన్ డే. ఇమ్ము ను అభిమానందిస్తూ జిల్లా పరిషత్ హైస్కూల్ గొప్పది అంటూ స్టేజ్‌పై నాగార్జున క్లాప్స్ ఎన్నో హృదయాల్లో సంతోషం నింపాయి.

ఆ తరువాత చెప్పాల్సింది ఆర్మీ జవాన్ కళ్యాణ్‌కు నాగార్జున మిలిటరీ స్టైల్ సెల్యూట్ చేసి అభినందించడం. టికెట్ టు ఫినాలే టాస్కుల్లో అదరగొట్టి ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచిన కళ్యాణ్ పడాలకు నువ్వు అర్హుడివి సైనికుడా అంటూ నాగ్ ఇచ్చిన ఎలివేషన్‌కు, ఆర్మీ పద్ధతిలో సెల్యూట్ చేయడం ఈ వారపు ప్రోమోకే హైలైట్ అని చెప్పాలి. ఒక సామాన్యుడు బిగ్ బాస్ ట్రోఫీ గెలిచి విన్నరవ్వాలనే అభిమానుల ఆశకు కళ్యాణ్ ప్రాణం పెట్టి ఆడాడు. ఆడియన్స్ కూడా అతనికి మద్దతుగా భారీ రెస్పాన్స్ ఇచ్చారు. కామన్ మ్యాన్‌కి బిగ్ బాస్ ఫైనల్ స్టెప్పు వద్ద ఇంత పెద్ద ఎంకరేజ్‌మెంట్ రావడం అరుదు. ఈ సీజన్‌లో హిస్టరీ రిపీట్ అవుతుందా? అన్న ప్రశ్న ఇక హాట్ టాపిక్ అయింది.

ఇమ్మానుయేల్, సంజన టాస్క్‌లో సంచాలక్‌గా వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న రీతూ చౌదరి పై నాగ్ ప్రశ్నలు విసిరారు. ఆమె చెప్పిన సమాధానాలు ఆడియన్స్‌ను కన్విన్స్ చేయలేకపోయాయి. దీంతో నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో ఊహించని ట్విస్ట్ రావచ్చని టాక్ మొదలైంది. రీతూ ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి.

లవ్ ట్రాక్, డ్రామా, చిన్న చిన్న గొడవలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నా…ఓట్లు మాత్రం చివరి మలుపులో తగ్గిపోగా రీతూకు ఇది ఎండ్ కార్డ్ అవుతుందా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఇక మరో ప్రోమోలో నాగార్జున హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ వారు గెలిచే అర్హత ఎంత వరుకు ఉందో, వారి ప్రత్యేకత ఏంటో తెలిపి, తాము గెలవడానికి అర్హులమని మిగిలిన వారి ఓటింగ్ తో నిర్ణయించాల్సి ఉంటుంది. ఇందులో కూడా కళ్యాణ్ పడాల, తనూజ కు అందరూ పూర్తీ అర్హత ఉందని ఒప్పుకున్నారు. సుమన్, భరణి, సంజన, పవన్, రీతూ కొన్ని తేడాలతో వెనుకంజలో ఉన్నారు. చూడాలి మరి ఆట ఏ మలుపు తీసుకోనుందో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ హౌస్ లో ట్రోఫీ గెలిచే అర్హులెవరు ? - Tholi Paluku