Let's talk: editor@tmv.in
బాస్కెట్‌బాల్‌ ప్రపంచకప్‌ క్వాలిఫైయర్స్‌: ఖతార్‌, లెబనాన్‌లతో భారత్‌ ఢీ

బాస్కెట్‌బాల్‌ ప్రపంచకప్‌ క్వాలిఫైయర్స్‌: ఖతార్‌, లెబనాన్‌లతో భారత్‌ ఢీ

Shaik Mohammad Shaffee
27 ఫిబ్రవరి, 2026

ఫిబా బాస్కెట్‌బాల్‌ ప్రపంచకప్ 2027 అర్హత పోటీల్లో (క్వాలిఫైయర్స్‌) భాగంగా భారత పురుషుల జట్టు రెండో విడత (సెకండ్ విండో) పోరుకు సిద్ధమైంది. ఈ విండోలో భారత్ తన తదుపరి మ్యాచ్‌ల్లో ఖతార్, లెబనాన్ జట్లతో తలపడనుంది. గ్రూప్-డిలో ఉన్న భారత్, శనివారం అర్ధరాత్రి ఖతార్‌తో, ఆ తర్వాత మంగళవారం లెబనాన్‌తో వారి సొంత గడ్డపైనే తలపడాల్సి ఉంది.

నిర్ణయాత్మక దశలో భారత్

తొలి విండోలో సౌదీ అరేబియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన భారత్, ప్రస్తుతం గ్రూప్ పట్టికలో అడుగున ఉంది. రెండో రౌండ్‌కు అర్హత సాధించాలంటే ఈ విండోలో భారత్ కచ్చితంగా మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. గ్రూప్-డిలో భారత్, ఖతార్, లెబనాన్, సౌదీ అరేబియా జట్లు ఉండగా.. ఖతార్ టోర్నీ ఆతిథ్య దేశం కావడంతో నేరుగా రెండో రౌండ్‌కు అర్హత పొందింది. మిగిలిన రెండు స్థానాల కోసం భారత్ మిగతా జట్లతో పోటీ పడాల్సి ఉంది. ప్రస్తుతం ఫిబా ర్యాంకింగ్స్‌లో భారత్ 75వ స్థానంలో ఉండగా, ఖతార్ 78, లెబనాన్ 28వ స్థానాల్లో ఉన్నాయి.

ప్రిన్స్‌పాల్‌ సింగ్ పునరాగమనం.. కోచ్‌గా ఫ్లెమ్మింగ్

ఈ కీలక మ్యాచ్‌ల కోసం భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య 12 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. గత విండోలో గాయం కారణంగా దూరమైన స్టార్ ప్లేయర్ ప్రిన్స్‌పాల్ సింగ్ జట్టులోకి తిరిగి రావడం భారత్‌కు పెద్ద ఊరట. ఇక భారత హెడ్ కోచ్ స్కాట్ ఫ్లెమ్మింగ్ తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించినప్పటికీ, ఈ విండో మ్యాచ్‌ల వరకు ఆయనే జట్టుకు మార్గనిర్దేశం చేయనున్నారు.

పోటీల షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం)

ఫిబ్రవరి 28 (శనివారం):

ఖతార్ వర్సెస్ భారత్ (లూసైల్) – అర్ధరాత్రి 12:30 గంటలకు

మార్చి 3 (మంగళవారం):

లెబనాన్ వర్సెస్ భారత్ (జౌక్ మికేల్) – అర్ధరాత్రి 12:30 గంటలకు.

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడంటే?

ఈ మ్యాచ్‌లను భారత్‌లో టెలివిజన్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదు. అయితే బాస్కెట్‌బాల్ ప్రేమికులు 'కోర్ట్‌సైడ్ 1891' యాప్, వెబ్‌సైట్ ద్వారా ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

భారత జట్టు సభ్యులు

కన్వర్ గుర్బాజ్ సింగ్ సంధు, హర్ష్ దాగర్, అర్విందర్ సింగ్, తుషల్ సింగ్, అరవింద్ కుమార్ ముత్తు కృష్ణన్, ముయిన్ బేక్ హఫీజ్, ప్రణవ్ ప్రిన్స్, ప్రత్యన్షు తోమర్, ప్రిన్స్‌పాల్ సింగ్, సహజ్ ప్రతాప్ సింగ్ సెఖోన్, ఆరోన్ మైఖేల్ మోంటెరో, అరవింద్ ఆరుముగం.