
బాల్ ఠాక్రే కార్టూన్‌పై ఇందిరాగాంధీ చర్యలు తీసుకోలేదు: కునల్‌కమ్రా
మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ తనపై తీసుకున్న చర్యలను స్టాండప్ కమెడియన్ కునల్ కమ్రా ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై వ్యంగ్యంగా పాట పాడినందుకు తనకు ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసుపై స్పందిస్తూ, శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే వేసిన కార్టూన్‌ను ఉదాహరణగా చూపించారు. ఈ కార్టూన్‌లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై విమర్శలు చేసిప్పటికీ, బాల్ ఠాక్రేపై ఎప్పుడూ ప్రివిలేజ్ చర్యలు తీసుకోలేదని కమ్రా పేర్కొన్నారు. ఈ మేరకు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి సమర్పించిన తన లిఖిత పూర్వక వివరణలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఠాక్రే రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నానని చెప్పుకుంటున్న నేపథ్యంలో, ఆయనపై చేసిన పాట కారణంగా తనపై ప్రివిలేజ్ ఉల్లంఘన కేసు పెట్టారని కమ్రా పేర్కొన్నారు. దీనిపై స్పందించిన రాష్ట్ర మంత్రి, శివసేన నేత ప్రతాప్ సర్‌నాయక్ మీడియాతో మాట్లాడుతూ కమ్రాపై ప్రివిలేజ్ తీర్మానం ఇప్పటికే అసెంబ్లీ కమిటీకి పంపించామని చెప్పారు. ఏక్‌నాథ్ షిండే పై పాటలు పాడుతూ విమర్శలు చేయాలనుకుంటే, గతంలో శివసైనికులు ఎలా స్పందించారో కూడా తెలుసుకోవాలని సర్నాయక్ హెచ్చరించారు.
అనేక కేసులు పెట్టారు
ఈ వ్యాఖ్యలపై కమ్రా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ తన రాత పూర్వకం సమాధానంలోని భాగాన్ని పంచుకున్నారు. గత ఏడాది నుంచి బాల్ ఠాక్రే రాజకీయ వారసత్వంపై చేసిన ఒక జోక్ కారణంగా తనపై అనేక కేసులు నమోదయ్యాయని ఆయన పేర్కొన్నారు. బాల్ ఠాక్రే అనేక అధికార ప్రముఖులను, అప్పటి ప్రధాన మంత్రులను కూడా కార్టూన్ల ద్వారా విమర్శించినప్పటికీ, ఆయనపై ఎప్పుడూ ప్రివిలేజ్ చర్యలు తీసుకోలేదని చెప్పారు. రాజకీయ వ్యంగ్యం స్వేచ్ఛను కాపాడటం కూడా ఆ వారసత్వంలో భాగమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ప్రజాప్రతినిధులకు నచ్చని వ్యాఖ్యల కారణంగా పౌరులపై కేసులు పెట్టి, శిక్షించగల అధికారం ఉండటం ప్రజాస్వామ్యంలో ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. ఈ విచారణ ద్వారా రాజ్యాంగంలోని ప్రివిలేజ్ నిబంధనల గురించి ప్రజలకు అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కమ్రా గతంలో నిర్భందంగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. అలాంటి క్షమాపణ కళాత్మక స్వేచ్ఛకు చెడు నిదర్శనంగా మారుతుందని ఆయన అన్నారు.
కేసు వివరాలు
మహారాష్ట్ర అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ ప్రసాద్‌లాడ్ మాట్లాడుతూ కమ్రా సమాధానాన్ని పరిశీలించిన తర్వాత కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. గత ఏడాది ముంబైలో నిర్వహించిన ఒక స్టాండప్ ప్రదర్శనలో కమ్రా, హిందీ చిత్రం దిల్‌తో పాగల్ హైలోని పాటను మార్పులు చేసి, శివసేనలో జరిగిన రాజకీయ విభేదాలపై వ్యంగ్యంగా ప్రదర్శించారు. 2022లో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు చేయడంతో శివసేనలో విభేదాలు తలెత్తి, అప్పటి మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం కూలిపోయింది. కమ్రా ఆ ప్రదర్శన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న తర్వాత, శివసేన కార్యకర్తలు 2025 మార్చిలో ముంబై ఖార్ ప్రాంతంలోని ఒక హోటల్‌పై దాడి చేసి ఆ ప్రదర్శన వేదికను ధ్వంసం చేశారు. దీనిపై ఖార్ పోలీస్ స్టేషన్‌లో కమ్రాపై కేసు కూడా నమోదైంది.
