
బాల్క సుమన్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం: మాజీ మంత్రి హరీష్‌రావు
మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మంచిర్యాల జిల్లా, క్యాతన్‌పల్లిలో చోటుచేసుకున్న పరిణామాలపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండిస్తూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల చేశారు.
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, అధికార బలంతో కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట అని ఆయన అభివర్ణించారు. హంగ్ పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల్లో ప్రతిపక్ష నాయకులను ప్రభావితం చేయడం, ప్రజా తీర్పును వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు.
జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్‌పై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ, అధికారుల సమక్షంలోనే ఇటువంటి ఘటనలు జరగడం ప్రజాస్వామ్య వ్యవస్థల బలహీనతకు నిదర్శనమని పేర్కొన్నారు. అధికారులు, పోలీసులు తగిన రక్షణ కల్పించలేదని కూడా విమర్శించారు. క్యాతనపల్లితో పాటు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ ప్రాంతాల్లో కూడా హంగ్ వచ్చిన చోట్ల ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పదవులను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో భూముల కబ్జా చేసినట్లే రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బాల్క సుమన్‌ను భేషరతుగా విడుదల చేయాలని, క్యాతనపల్లి చైర్మన్ ఎన్నికలు ప్రజాస్వామ్య వాతావరణంలో జరిగేలా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
