Let's talk: editor@tmv.in
బాలికల విద్యతోనే దేశ ప్రగతి: ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు

బాలికల విద్యతోనే దేశ ప్రగతి: ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు

Panthagani Anusha
13 జనవరి, 2026

బాలికల విద్య సామాజిక మార్పుకు నాంది అని అది దేశ అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఒడిశా రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ఉద్ఘాటించారు. ఆదివారం ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల కేంద్రంలోని 'నివేదిత గురుకులం' నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గురుకులం ద్వితీయ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.

గురుకులం అంటే కేవలం పాఠాలు చెప్పే కేంద్రం కాదని అది క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసే ఒక సంపూర్ణ జీవన విధానమని గవర్నర్ కొనియాడారు. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబం బాగుపడుతుంది. ఆ కుటుంబాల అభివృద్ధి ద్వారానే సమాజం, తద్వారా దేశం ఆర్థికంగా సామాజికంగా బలోపేతమవుతుంది" అని ఆయన పేర్కొన్నారు. సిస్టర్ నివేదిత సేవలను స్మరించుకుంటూ.. ఆమె విదేశాల్లో పుట్టినప్పటికీ భారతదేశాన్ని కర్మభూమిగా మార్చుకుని మహిళా సాధికారతకు కృషి చేశారని గుర్తు చేశారు.

వెనుకబడిన వర్గాల విద్యపై ఆందోళన

దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నప్పటికీ షెడ్యూల్డ్ తెగల (ఎస్‌టి) బాలికల అక్షరాస్యత విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నామని గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒడిశా వంటి రాష్ట్రాల్లో గిరిజన బాలికల విద్యపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జాతీయ విద్యా విధానం-2020' విద్యార్థులను ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలను సృష్టించే స్థాయికి ఎదిగేలా ప్రోత్సహిస్తుందని ఆయన వెల్లడించారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సాహస విన్యాసాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హోమం నిర్వహించడంతో పాటు కోలాటం, యోగాసనాలు, రోప్ యోగా, సైకిల్ విన్యాసాలు మరియు జడ కోలాటం ప్రదర్శించి తమ ప్రతిభను చాటుకున్నారు. ఆధునిక విద్యతో పాటు యోగ, వేద పఠనం నేర్చుకుంటున్న విద్యార్థులు భవిష్యత్తులో భారతీయ సంస్కృతికి రాయబారులుగా నిలుస్తారని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రిరెడ్డి, శ్రీ విజ్ఞాన విహార వైస్ ప్రెసిడెంట్ వల్లభనేని సుధాకర్ చౌదరి, డాక్టర్ చదలవాడ నాగేశ్వరరావు, దాసరి వెంకట బాలవర్ధన రావు, కోనేరు సత్యనారాయణ, గోకరాజు గంగరాజు, ఆర్ఎస్ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యుడు భాగయ్య, ప్రధానోపాధ్యాయురాలు సావిత్రి, విద్యా కమిటీ ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.