
బాలల హక్కుల పరిరక్షణ బృహత్తర బాధ్యత: ఏపీ సీఎం
బాలల హక్కుల పరిరక్షణ అనేది ఒక బృహత్తరమైన బాధ్యత అని దీనిని ఒక యజ్ఞంలా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నూతనంగా ఎంపికైన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్, సభ్యులు బుధవారం సాయంత్రం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషన్ బాధ్యతలను భవిష్యత్ కార్యాచరణను ఉద్దేశించి సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
పిల్లల ఆరోగ్యం, విద్య, వికాసం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని వారి హక్కుల కోసం కమిషన్ నిస్వార్థంగా పాటుపడాలని ముఖ్యమంత్రి సూచించారు. రేపటి పౌరులైన చిన్నారుల అభ్యున్నతి కోసం పనిచేయడం అంటే సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావడమే అని ఆయన పేర్కొన్నారు. బాలల సంక్షేమం కోసం కమిషన్ చేసే ప్రతి ప్రయత్నానికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ వేటుకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తమకు దిశా నిర్దేశం చేశారని పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీబాబు, పద్మలత, డాక్టర్ నాగ మానస, డాక్టర్ శ్రీనివాసమూర్తి, మందాల గంగ సూర్యనారాయణ, చల్ల మధుసూదన రావు ఉన్నారు. కమిషన్ సభ్యులను ఆత్మీయంగా పలకరించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో బాలల హక్కులకు భంగం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
