Let's talk: editor@tmv.in
బాల‌కృష్ణ బాధ్య‌త లేని వ్య‌క్తి : తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి

బాల‌కృష్ణ బాధ్య‌త లేని వ్య‌క్తి : తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి

Pinjari Chand
1 అక్టోబర్, 2025

బాల‌కృష్ణ బాధ్య‌త‌లేని మాట‌లు మాట్లాడుతున్నార‌ని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇంచార్జీ తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి విమ‌ర్శించారు. మీరు పైనుంచి దిగివ‌చ్చారా అని ప్ర‌శ్నించారు. మిమ్మ‌ల్ని మీరు గొప్ప‌గా భావించే విధానం, మిగిలిన వారిని చుల‌క‌న‌గా చూసే విధానం స‌రికాద‌ని అన్నారు. బాల‌కృష్ణ త‌ప్పా చంద్ర‌బాబుకు హిందూపురంలో అభ్య‌ర్థి దొర‌క‌లేదా అని ప్ర‌శ్నించారు. చిరంజీవిని ఎవ‌డూ అంటూ బాల‌కృష్ణ మాట్లాడ‌టం దారుణమ‌ని అన్నారు.

తల్లిని అవ‌మానించిన వారి పంచ‌న చేరిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, అన్న‌ను అవ‌మానించినా మాట్లాడ‌టం లేద‌ని విమ‌ర్శించారు. అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. జ‌గ‌న్ చిరంజీవిని గౌర‌వించిన‌ప్ప‌టికీ .. అన‌వ‌స‌రంగా అబాండాలు వేసార‌ని తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లకు తెలుగుదేశం పార్టీపై ఉన్న న‌మ్మ‌కం పోయింద‌ని, వాస్త‌వం గ్ర‌హించార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. బాల‌కృష్ణ త‌ర‌చూ చేస్తున్న వ్యాఖ్య‌లు స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకునే విధంగా ఉన్నాయ‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ హిందూపురం ప్ర‌జ‌లు బాల‌కృష్ణను ఎందుకు గెలిపిస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని అభిప్రాయప‌డ్డారు.

బాల‌కృష్ణ ఇద్ద‌రి కూతుర్ల తండ్రిగా గ‌తంలో మ‌హిళ‌ల గురించి అవ‌మాన‌క‌రంగా మాట్లాడార‌ని గుర్తు చేశారు. మేన్ష‌నౌస్ మందు తాగుతూ గ్లాసు తిర‌గేస్తే... త‌ల్లి పెళ్లాం అవుతుందా.. పెళ్లాం త‌ల్లి అవుతుందా అంటూ తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ను ప్ర‌శ్నించారు. బాల‌కృష్ణ ఏం మాట్లాడినా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వెన‌కేసుకొస్తోంద‌ని విమ‌ర్శించారు. చిరంజీవి విష‌యంలో జ‌గ‌న్ పై అన‌వ‌స‌ర బుర‌దజ‌ల్లి అధికారంలోకి వ‌చ్చార‌ని తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి అన్నారు. టీడీపీ, వారి అనుకూల మీడియా గురించి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా అర్థ‌మ‌యింద‌ని, ఇక న‌మ్మే ప‌రిస్థితి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

బాల‌కృష్ణ బాధ్య‌త లేని వ్య‌క్తి : తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి - Tholi Paluku