
బారామతి విమాన ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణానికి కారణమైన బారామతి విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో భాగంగా మహారాష్ట్ర క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ) గురువారం వీఎస్‌ఆర్ వెంచర్స్ సంస్థ యజమాని వీకే సింగ్‌ను ప్రశ్నించింది. వీకే సింగ్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నామని ఒక సీఐడీ అధికారి తెలిపారు. అయితే విచారణకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించలేదు. విచారణ ఇంకా కొనసాగుతోందని చెప్పారు. విమాన ప్రమాదం అనంతరం బారామతి తాలూకా పోలీస్ స్టేషన్‌లో ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును పుణే సీఐడీకి బదిలీ చేశారు. ఈ ప్రమాదం వెనుక సాబటేజ్, క్రిమినల్ నిర్లక్ష్యం ఉందా అన్న కోణంలో సీఐడీ దర్యాప్తు చేస్తున్నట్లు ముందే తెలిపింది. వీకే సింగ్‌ను ప్రశ్నించే కొద్ది రోజుల ముందు, విమాన ప్రమాదంపై విచారణలో భాగంగా అధికారులు వీఎస్‌ఆర్ సంస్థకు ప్రశ్నల జాబితా పంపినట్లు సమాచారం.
ఇక రోహిత్ పవార్ బుధవారం మాట్లాడుతూ, ఈ కేసులో ఎవరో వీఎస్‌ఆర్ సంస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. విమాన ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రాథమిక నివేదిక తన అనుమానాలను సమర్థిస్తోందని ఆయన చెప్పారు. 22 పేజీల ప్రాథమిక నివేదికలో ప్రమాద సమయంలో విజిబిలిటీ అవసరమైన స్థాయికంటే తక్కువగా ఉందని ఏఏఐబీ పేర్కొంది. అలాగే రన్‌వేపై గుర్తులు మసకబారటం, రన్‌వే ఉపరితలంపై లూజ్ గ్రావెల్ ఉండటం వంటి అంశాలను కూడా సూచించింది. కొద్ది రోజుల క్రితం అజిత్ పవార్ కుమారుడు జయ్ పవార్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో వీకే సింగ్ కుమారుడు రోహిత్‌సింగ్ ఒక విమాన ప్రయాణ సమయంలో చీఫ్ పైలట్ సీటులో నిద్రపోతున్నట్లు కనిపించాడని ఆరోపిస్తూ, అతడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తన తండ్రి విమాన ప్రమాదంపై విచారణ పూర్తయ్యే వరకు వీఎస్‌ఆర్ వెంచర్స్‌కు చెందిన అన్ని విమానాలను గ్రౌండ్ చేయాలని కూడా ఆయన కోరారు.
జనవరి 28న లియర్ జెట్ 45 విమానం పుణే జిల్లా బారామతి ఎయిర్ స్ట్రిప్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మరణించారు. ఈ విమానాన్ని వీఎస్‌ఆర్ వెంచర్స్ సంస్థ నిర్వహిస్తోంది.
