Let's talk: editor@tmv.in
బారామతి ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరణ

బారామతి ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరణ

Pinjari Chand
10 ఏప్రిల్, 2026

మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఉపసంహరించుకుంది. రాష్ట్ర రాజకీయ సంస్కృతి, మర్యాదను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని పార్టీ వెల్లడించింది. పుణె జిల్లాలోని బారామతి నియోజకవర్గానికి కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన ఆకాశ్ మోరే చివరి గడువుకు ముందు గురువారం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. పార్టీ నాయకత్వం సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి తప్పుకున్నప్పటికీ, ఇతర అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఏప్రిల్ 23న ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు మే 4న నిర్వహించనున్నారు.

ఈ విషయంపై ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్‌ మాట్లాడుతూ, రెండు నెలల క్రితం విమాన ప్రమాదంలో అప్పటి ఉప ముఖ్యమంత్రి అజిత్‌పవార్‌‌ మరణించిన నేపథ్యంలో రాజకీయ మర్యాదను పాటించేందుకే పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బారామతి ఉపఎన్నికలో ప్రస్తుతం ఆయన భార్య సునేత్రా పవార్‌‌ పోటీలో ఉన్నారని గుర్తుచేశారు. బారామతి ఉపఎన్నికలో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటున్నప్పటికీ, ఎలాంటి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దానితో తమ నిర్ణయానికి సంబంధం లేదని సప్కాల్ తెలిపారు.

బారామతి ఉపఎన్నికలో సునేత్రా పవార్ స్వయంగా తనతో మూడుసార్లు మాట్లాడారని, ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేను కూడా కలిసి అభ్యర్థిని ఉపసంహరించుకోవాలని కోరినట్లు ఆయన వెల్లడించారు. 2029 అసెంబ్లీ ఎన్నికలలో బారామతి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకుంటామని సప్కాల్ ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అహిల్యానగర్ జిల్లాలోని రాహురి అసెంబ్లీ ఉపఎన్నిక కూడా ప్రస్తుత ఎమ్మెల్యే మరణంతోనే జరగుతున్నందున, అక్కడ కూడా ఇదే విధమైన రాజకీయ మర్యాద పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బారామతి ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఉపసంహరణ - Tholi Paluku