Let's talk: editor@tmv.in
బాబా మార్గం..సేవే పరమ ధర్మం :ప్రధాని మోడీ

బాబా మార్గం..సేవే పరమ ధర్మం :ప్రధాని మోడీ

Pinjari Chand
20 నవంబర్, 2025

ఈ రోజు మీ అందరి మధ్య పవిత్రమైన పుట్టపర్తి నేలపై ఉండటం నాకు ఆధ్యాత్మికంగా ఎంతో అనుభూతిని కలిగిస్తోందని ప్రధాని మోడీ భావోద్వేగంగా మాట్లాడారు. బుధవారం సత్యసాయి బాబా జయంత్యుత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ సాయిరాం అంటూ ప్రసంగాన్ని ఆరంభించారు. ఎందరో మహానుభావులు..అందరికీ వందనాలు అని తెలుగులో మాట్లాడి అందరినీ ఉత్సహ పరిచారు. సత్యసాయి బాబా శతాబ్ది సంవత్సరం ఒక్క తరానికి చెందిన వేడుక మాత్రమే కాదు. ఇది దైవానుగ్రహం అని మోడీ స్పష్టం చేశారు. బాబా భౌతికంగా మన మధ్య లేకున్నా ఆయన బోధనలు, ప్రేమ, సేవా స్పూర్తి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి మార్గదర్శకంగా నిలిచాయన్నారు. 140 దేశాల్లో బాబా సందేశం వెలుగులీనుతోందని గుర్తు చేశారు.

వసుదైవ కుటుంబం… సాయిబాబా జీవన లక్ష్యం

ప్రపంచమే ఒక్క కుటుంబం అన్న భావనను బాబా తన జీవన విధానంతో చూపెట్టారని ప్రధాని ప్రశంసించారు. అందుకే ఈ శతాబ్దోత్సవం ప్రేమ, శాంతి, సేవల మహోత్సవంగా మారిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రూ.100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది. బాబా సేవా వారసత్వానికి ప్రతిబింబాలని మోడీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు, సేవాదారులకు, అనుచరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సేవే భారత ఆత్మ

భారత నాగరికతకు విలువ ‘సేవ’భక్తి, జ్ఞానం, కర్మ… ఏ మార్గం నడిచినా చివరికి చేరేది సేవ దగ్గరే. సేవ లేకుంటే భక్తి ఎలా పూర్తి అవుతుంది? కరుణ కురిపించని జ్ఞానం ఏం ప్రయోజనం? సమాజానికి పనికిరాని కాని కర్మ ఏమిటి? అని ప్రశ్నించారు. సేవ పర్మో ధర్మః – ఇదే భావం శతాబ్దాలుగా భారత నాగరికతను నిలబెట్టిందని నొక్కి చెప్పారు. ఎంతమందో సంఘ సంస్కర్తలు, గురువులు, మహనీయులు తమ కాలానికి తగ్గట్టు ఈ సందేశాన్ని కొనసాగించారని గుర్తు చేశారు.

బాబా బోధనల సారం..లవ్ ఆల్ – సర్వ్ ఆల్

సత్యసాయి బాబా సేవనే మానవ జీవిత కేంద్రంగా పెట్టారని ప్రధాని పేర్కొన్నారు. సేవ అనేది ప్రేమకు రూపం అని ఆయన వివరించారు. బాబా స్థాపించిన విద్య, వైద్య, గ్రామాభివృద్ధి, సేవా సంస్థలు… ఇవన్నీ ఆధ్యాత్మికత, సేవలకు విడదీయలేని బంధానికి ప్రత్యక్ష నిదర్శనం అన్నారు. బాబా భౌతికంగా లేకున్నా, ఆయన సంస్థల ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు రోజురోజుకు మరింత పెరుగుతున్నాయి. మహానుభావుల ప్రభావం కాలంతో పాటు పెరుగుతుందే తప్ప తగ్గదు అని వివరించారు. బాబా సందేశం పుస్తకాలకో, ప్రవచనాలకో, ఆశ్రమ గోడలకో పరిమితం కాలేదని ప్రధాని అన్నారు. పట్టణాల నుంచి పల్లెల దాకా, పాఠశాలల నుంచి గిరిజన ప్రాంతాల దాకా విద్య, సంస్కృతి, వైద్య సేవల ప్రవాహం కనిపిస్తోంది అన్నారు. అలాగే లక్షలాది మంది భక్తులు ఆయన సేవలో నిస్వార్థంగా నిమగ్నమై ఉన్నారని వివరించారు. మానవసేవే..మాధవసేవగా బాబా అనుచరులు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ సేవ చేయి..బాగా శ్రమించు అని తెలిపారు.

ప్రజల సంక్షేమమే బాబా ధ్యేయం

సత్యసాయి బాబా ఆధ్యాత్మికతను సమాజహితానికి అంకితం చేశారని ప్రధాని చెప్పారు. సేవ, వ్యక్తిత్వ వికాసం, విలువలతో కూడిన విద్యను బాబా జీవితాంతం నడిపించారని గుర్తుచేశారు. బాబా ఎటువంటి సిద్ధాంతాన్ని ఎవరికీ రుద్దలేదని… పేదల బాధను, కష్టాలను తీర్చడమే ఆయన నిజమైన సిద్ధాంతమని అన్నారు. గుజరాత్ భూకంప సమయంలో బాబా సేవలు అనిర్వచనీయని గుర్తు చేసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అనేక విధాలుగా ఆయన సంస్థ నుంచి సేవలు అందాయని తెలిపారు. ఒక్క సమావేశం, ఒక్కసారి బాబా దర్శనం చేసుకున్న కూడా చాలామంది జీవితాల దిశను మార్చిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ వేడుకలో కూడా అటువంటి అనుభవాలు కలిగిన అనేక మంది ఉన్నారని తెలిపారు. సత్యసాయి ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా, సంస్థాగతంగా, దీర్ఘకాలికంగా సాగుతున్నాయని ప్రధాని ప్రశంసించారు. నీరు, ఇళ్లు, ప్రకృతి విపత్తుల సమయంలో, వైద్యం, న్యూట్రిషన్ తదితర కార్యక్రమాలు సంస్థ అద్భుతంగా పని చేస్తుందన్నారు.

మోడీ పేర్కొన్న సేవా కార్యక్రమాలు :

• ఇక్కడ నీటి కోసం ఇబ్బందులు పడకుండా రాయలసీమలో 3,000 కిలోమీటర్ల పైప్‌ లైన్ వేసి తాగు నీటి సమస్యకు పరిష్కారం

• ఒడిశాలో వరద బాధిత కుటుంబాలకు 1,000 ఇళ్లు నిర్మించారు.

• బిల్లింగ్ కౌంటర్ లేకుండా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు నిర్మించారు.

సుకన్య సమృద్ధి యోజన పథకంలో బాలికలను చేర్చడం

20,000 పైగా సుకన్యా సమృద్ధి ఖాతాలు బాలికల పేర్లలో తెరచి, దీంతో వారి విద్యా–భవిష్యత్తుకు భరోసా కల్పించారని చెప్పారు. దేశంలో ప్రభుత్వ పథకాల్లో అత్యధికమైన 8.2% వడ్డీ కలిగిన పథకం ఇదేనని ప్రధాని గుర్తు చేశారు. పది సంవత్సరాల క్రితం బాలికల విద్య, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 4 కోట్లకు పైగా సుకన్యా ఖాతాలు తెరిచారని, వాటిలో రూ.3.25 లక్షల కోట్లకు పైగా డిపాజిట్ అయ్యిందని ప్రధాని తెలిపారు. గతంలో వారణాసిలో కూడా ఇలానే బాలికల కోసం ఖాతాలు తెరిచామన్నారు. దేశంలో 11 సంవత్సరాల నుంచి సాంఘిక సంస్కరణలు చేపట్టాం. దేశంలోని పేదలకు, అణగారిన వర్గాలకు సాంఘిక భద్రత కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 100 కోట్ల మందికి పైగా సోషల్ సెక్యూరిటీ కల్పించాం. ప్రపంచంలో అన్ని చోట్లా ఇదే చర్చ జరుగుతోందని వివరించారు. అలాగే వారణాసిలో గిర్ గోవుల అభివృద్ధి చేపట్టిన చర్యలను గురించి తెలిపారు. ఈరోజు దేశం వికసిత్ భారత్ వైపు పయనిస్తుందని తెలిపారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సాహించాలని కోరారు. సత్యసాయి బాబాను ప్రేరణగా తీసుకుని ఆత్మనిర్భర్ భారత్ ను నిర్మించాలని కోరారు.