Let's talk: editor@tmv.in
బాబర్‌ ఆజమ్‌కు ఐసీసీ భారీ జరిమానా

బాబర్‌ ఆజమ్‌కు ఐసీసీ భారీ జరిమానా

Shaik Mohammad Shaffee
19 నవంబర్, 2025

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ శ్రీలంకతో రావల్పిండిలో నవంబర్ 16న జరిగిన మూడవ వన్డే సందర్భంగా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని లెవెల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు ఆయన మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది.

31 ఏళ్ల బాబర్ ఆజమ్ ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయక సిబ్బందికి సంబంధించిన ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.2ను ఉల్లంఘించినట్లు తేలింది. ఈ ఆర్టికల్ అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, దుస్తులు, గ్రౌండ్ పరికరాలు, ఫిక్చర్‌లు, ఫిట్టింగ్‌లను దుర్వినియోగం చేయడానికి సంబంధించినది.

పాకిస్తాన్ ఇన్నింగ్స్‌లోని 21వ ఓవర్‌లో జెఫ్రీ వాండర్‌సే బౌలింగ్‌లో అవుటైన తర్వాత, బాబర్ ఆజం నిరాశతో తన బ్యాట్‌తో వికెట్లను కొట్టారు. మ్యాచ్ అధికారులు ఈ సంఘటనను వెంటనే గుర్తించారు. ఈ ఉల్లంఘనకు గాను బాబర్‌కు జరిమానాతో పాటు, అతడి క్రమశిక్షణా రికార్డులో ఒక డిమెరిట్ పాయింట్ కూడా జోడించారు. గత 24 నెలల కాలంలో బాబర్‌కు ఇది మొదటి ఉల్లంఘన.

ఆన్-ఫీల్డ్ అంపైర్లు అలెక్స్ వార్ఫ్, రషీద్ రియాజ్, థర్డ్ అంపైర్ షర్ఫౌద్దౌలా ఇబ్నే షాహిద్, నాల్గవ అంపైర్ ఫైసల్ అఫ్రిది ఈ అభియోగాన్ని మోపారు. ఐసీసీ మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌కు చెందిన అలీ నఖ్వి జరిమానాను ప్రతిపాదించారు. పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం ఎలాంటి విచారణ కోరకుండానే అభియోగాన్ని, జరిమానాను అంగీకరించారు. ఐసీసీ నిబంధనల ప్రకారం, లెవెల్ 1 ఉల్లంఘనలకు కనీస శిక్ష అధికారిక మందలింపు, గరిష్టంగా ఆటగాడి మ్యాచ్ ఫీజులో 50 శాతం, ఒకటి లేదా రెండు డిమెరిట్ పాయింట్లు విధించవచ్చు.

కాగా, స్వదేశంలో శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాకిస్థాన్‌ 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ బౌలర్ల ధాటికి, శ్రీలంక 45.2 ఓవర్లలో 211 10 పరుగులు మాత్రమే చేయగలిగింది. సదీర సమరవిక్రమ (48), పవన్ రత్నాయకే (32) కీలక పరుగులు చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో మహమ్మద్ వసీం మూడు వికెట్లు, ఫైసల్ అక్రమ్, హారిస్ రౌఫ్ చెరో రెండు వికెట్లు తీశారు.

212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ హసీబుల్లా ఖాన్ రూపంలో తొలి వికెట్‌ను త్వరగా కోల్పోయింది. అయితే ఫఖర్ జమాన్ (45 బంతుల్లో 55) ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. బాబర్ ఆజం 34 పరుగులు చేసి జట్టును లక్ష్యం వైపు నడిపించాడు. ఆ తర్వాత మహమ్మద్ రిజ్వాన్ (61 నాటౌట్), హుస్సేన్ తలత్ (42 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.