
బాన్సువాడలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ... లాఠీచార్జ్ చేసిన పోలీసులు
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు. బాన్సువాడ పట్టణంలోని ఒక షాపింగ్ మాల్‌లో జరిగిన వాగ్వాదం ఈ ఘటనకు దారితీసింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం బాన్సువాడలోని మాల్‌కు వచ్చిన ఒక వ్యక్తి అక్కడ వినిపిస్తున్న మతపరమైన సంగీతంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఆ సంగీతం ఎందుకు ప్లే చేస్తున్నారంటూ ప్రశ్నించిన అతను, అక్కడి పరిస్థితులను తన మొబైల్ ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించడం ప్రారంభించాడు. దీనిపై మాల్‌లో పనిచేస్తున్న ఒక మహిళా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్య మాటామాటా పెరిగిందని పేర్కొన్నారు.
ఈ వాగ్వాదం క్రమంగా ఘర్షణకు దారి తీసి, మాల్ సిబ్బంది, ఆ వ్యక్తి మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. విషయం బయటకు రావడంతో రెండు వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అందువల్ల శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ నిర్వహించి గుమికూడిన వారిని చెదరగొట్టారు. వెంటనే అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రాంతంలో శాంతి నెలకొని ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరూ కూడా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, శాంతియుతంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
