Let's talk: editor@tmv.in
బాధ్యులను వదిలిపెట్టం

బాధ్యులను వదిలిపెట్టం

Aravind Maryada Reddy
1 అక్టోబర్, 2025

తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. చిన్నపిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు, రాజకీయ పరమైన ఆరోపణలు వస్తున్నాయి. టీవీకే నేతలు, డీఎంకే నేతలు పరస్పరం విమర్శించుకుంటున్నారు. ప్రభుత్వ భద్రతా వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఓ వైపు వాదనలు వినిపిస్తుండగా.. సభకు విజయ్ ఆలస్యంగా రావడం కూడా ఓ కారణమని మరికొందరు విమర్శిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ ఈ ఘటనలో 41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వారిలో చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు. ఎన్నో కుటంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చింది. తండ్రులను కోల్పోయిన పిల్లలు, తల్లులకు దూరమైన చిన్నారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంచానికి పరిమితమైన వారూ ఉన్నారు. ఇలా ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోనే కాక యావత్ దేశాన్ని ఒక్కసారిగా కదిలించింది. జనం ఎందుకు ఇలా గుంపులుగా వెళతారో అర్థం కానీ పరిస్థితి. కాగా ఈ ఘటనపై తాజాగా తమిళనాడు మంత్రి స్పందించారు. ఈ ఘటనపై పకడ్బందీగా విచారణ చేస్తున్నామని తమిళనాడు విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేష్ పేర్కొన్నారు.

బాధ్యులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం "రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ ఘటనకు పోలీసులు బాధ్యులా? లేదంటే సభ నిర్వహించిన టీవీకే ప్రతినిధులే కారకులా? అంత చిన్న సందులో ఎందుకు ర్యాలీకి అనుమతించారు .. అన్న చర్చ కూడా సాగుతోంది.

విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని మహేష్ తెలిపారు. జీవితం అత్యంత ముఖ్యం. నాయకులను అనుసరించడం వారి కోసం పరుగులు తీయడం సరికాదని మంత్రి అన్బిల్ మహేశ్ సూచించారు.

కూరూర్‌కు ఎన్డీయే బృందం

ఎన్డీఏ ఎనిమిది మంది సభ్యుల బృందం ఈ రోజు కరూర్‌కు బయలుదేరి, తొక్కిసలాట జరిగిన పరిస్థితులను విచారించనుంది. ఈ బృందం అక్టోబర్ 2 వరకు కరూర్‌లో ఉండి, తమ ఆధారాల ఆధారంగా వివరణాత్మక నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ బృందం ఈ విషాదంలో బాధిత కుటుంబాలను కూడా కలవనుంది. ఏఎన్ఐతో మాట్లాడుతూ, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, ఈ బృందంలో సభ్యుడిగా, "కరూర్‌లో జరిగిన ఘటనలో 40 మందికి పైగా మరణించారు. కాబట్టి, ఎన్డీఏ బృందం అక్కడికి వెళ్లి, ఈ ఘటన ఎలా, ఎందుకు జరిగిందో తెలుసుకోవడానికి రోజంతా అక్కడ ఉంటుంది. ప్రభుత్వానికి నివేదిక సమర్పించబడుతుంది..." అని అన్నారు. ఈ బృందాన్ని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏర్పాటు చేశారు. ఇందులో బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, బ్రజ్ లాల్, అపరాజిత సారంగి, రేఖా శర్మ, శివసేన శ్రీకాంత్ షిండే, మరియు తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నుండి పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. బీజేపీ ఎంపీ హేమా మాలిని ఈ కమిటీకి కన్వీనర్‌గా ఉన్నారు. మరణించిన వారిలో 18 మంది మహిళలు మరియు 10 మంది పిల్లలు ఉండటం గమనార్హం.

తొక్కిసలాట ఘటనపై రాజకీయాలు

కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాజకీయాలు మొదలయ్యాయి. ఈ ఘటన ఎందుకు జరిగింది? ఈ ఘటనకు మూలం ఏమిటి? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలా చర్యలు తీసుకోవాలి? అన్న కోణంలో కాకుండా పరస్పర ఆరోపణలకు రెండు పార్టీలు దిగుతున్నాయి. ఏపీఐ, బీజేపీ, కాంగ్రెస్ వంటి పక్షాలు కూడా ఈ ఘటనను రాజకీయ ఆయుధంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

కరూర్‌లోని వెలుసామీపురం (కరూర్-ఎరోడ్ రోడ్డు)లో జరిగిన ఈ ర్యాలీకి టీవీకే 12,000 మంది హాజరుకు అనుమతి అడిగింది. కానీ అంతకు మించిన స్థాయిలో జనం వచ్చారు ర్యాలీ సమయం మధ్యాహ్నం 12 గంటలకు ఉండగా, విజయ్ 7 గంటల తర్వాతే చేరారు. దీంతో అభిమానులు గంటల తరబడి ఎదురుచూస్తూ అలసిపోయారు. విజయ్ ని దగ్గర నుంచి చూద్దామన్న భావించిన ప్రజలు ఒక్కసారిగా ఒకరిమీదకు ఒకరు పడిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

పోలీసులు టీవీకే కోరిన నాలుగు ప్రదేశాలకు అనుమతి ఇవ్వకపోవడంతో, ఈ చిన్న ప్రదేశానికి (1.2 లక్షల చదరపు అడుగులు) పరిమితం చేశారు. భద్రతా అధికారులు 10,000 మందికి మాత్రమే సరిపడా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ కట్ (టీవీకే జెనరేటర్ దెబ్బతినడం), ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం.. కొందరు రాళ్లు విసరడం కూడా ఘర్షణకు దారి తీసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత దుర్మార్గ ర్యాలీ విషాదాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీనిని "అతి భయానక విషాదం"గా అభివర్ణించారు.

ఎవరు బాధ్యులు?

ఘటన తర్వాత, టీవీకే, డీఎంకే మధ్య ఆరోపణలు ముమ్మరమయ్యాయి. ఇది కేవలం విమర్శలకు దాటి, రాజకీయ లెక్కలు మాన్యంగా మలిచినట్టుగా కనిపిస్తోంది.పోలీసులు భద్రత కల్పించలేదని విజయ్ అభిమానులు చెబుతున్నారు. కరూర్ లో సభ సక్సెస్ కావొద్దని స్థానిక డీఎంకే నేతలు పోలీసులకు సూచించారని వారు అంటున్నారు. అందుకే ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. విజయ్ చేరుకునేటప్పుడు ఉద్దేశపూర్వక విద్యుత్ కట్ చేశారని వారు ఆరోపిస్తున్నారు. లాఠీఛార్జ్, రాళ్ల విసిరడం, ఖాళీ ఆంబులెన్సులు తీసుకువచ్చి కలకలం సృష్టించారని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలకు అనుమతి ఇవ్వకపోవడం, చివరి క్షణంలో చిన్న స్థలం కేటాయించడం కుట్ర పూరితంగా జరిగిందని టీవీకే ఆరోపిస్తోంది.

విజయ్ ఆలస్యం వల్లే..

మధ్యాహ్నం ర్యాలీకి రావాల్సిన విజయ్ ఆలస్యంగా రావడం వల్లే తొక్కిసలాట జరిగిందని డీఎంకే ఆరోపిస్తోంది. డ్రోన్ షాట్ల కోసం జనాలను కిక్కిరిసిపోయేలా చేశారని.. కేవలం 12 వేల మందికే అనుమతి తీసుకొని అంతకంటే అనేక రెట్ట జనాలను తీసుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూశారని టీవీకే అంటున్నది. నీరు, భద్రత ఏర్పాట్లు లేవని చెబుతున్నారు.

టీవీకే ఆరోపణలు 'కుట్ర'పై ఆధారపడి ఉన్నాయి. కానీ డీఎంకే 'ప్లానింగ్ లోపాలు'పై దృష్టి పెట్టింది. డీఎంకే మంత్రి సెంథిల్ బలాజీపై టీవీకే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. డీఎంకే ప్రభుత్వంలో 'భద్రతా లోపాలు' బయట పడ్డాయని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ర్యాలీ స్థలం ఉద్దేశపూర్వకంగా చిన్నదిగా ఇచ్చారని విమర్శించారు.

స్టాలిన్ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్నదని డీఎంకే నేతలు చెప్పుకుంటున్నారు. రూ.10 లక్షలు పరిహారం, రిటైర్డ్ జడ్జి కమిషన్ ఏర్పాటు. స్టాలిన్, మంత్రులు (సెంథిల్ బలాజీ, అన్బిల్ మహేష్) బాధిత కుటుంబాలను పరామర్శించారు. కానీ, విమర్శకులు దీనిని 'సానుభూతి షో'గా చూస్తున్నారు. పోలీసులు 25 మందిపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేశారంటూ కేసులు నమోదు చేశారు. ఇది భావప్రకటన స్వేచ్ఛను లేకుండా చేయడమేనని ప్రజాస్వామ్య వాదులు చెబుతున్నారు.

సోషల్ మీడియాలో ఆగ్రహం

ఎక్స్ (ట్విట్టర్)లో డీఎంకే కుట్ర అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. డీఎంకే మద్దతుదారులు 'టీవీకే ఆర్గనైజేషన్ లోపాలపై దృష్టి పెడుతున్నారు. 2026 ఎన్నికల ముందు అధికార బలాన్ని కాపాడుకోవాలని డీఎంకే ప్రయత్నిస్తోంది. మరోవైపు టీవీకే విజయ్ రాష్ట్రంలో ప్రత్యామ్నయ శక్తిగా ఎదగాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. మరి చివరకు బాధ్యులకు శిక్ష పడుతుందా? భవిష్యత్‌లో తమిళనాడులో ఈ తరహా ర్యాలీలు ఎక్కువగా జరగబోయే అవకాశం ఉంది కాబట్టి.. ఏవైనా కఠిన చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.

బాధ్యులను వదిలిపెట్టం - Tholi Paluku