
బాధిత కాంగ్రెస్ కార్యకర్తకు మంత్రి వివేక్ పరామర్శ
క్యాతనపల్లిలో ఇటీవల బీఆర్‌ఎస్ నాయకులు జరిపిన దాడిలో గాయపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జావిద్ ఖాన్‌ను రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి మందమర్రిలో పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పిన మంత్రి, ఇటువంటి హింసాత్మక ఘటనలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు తెలిపారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం ఏటీసీ సెంటర్లలో హార్టీకల్చర్, అగ్రికల్చర్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఈ కేంద్రాల్లో చదివే ప్రతి విద్యార్థికి నెలకు రూ.2,000 స్కాలర్‌షిప్ అందించనున్నట్లు ఆయన తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన పేదలకు మంజూరు చేశామని, రాబోయే ఏప్రిల్‌లో మరో 2,000 ఇళ్లను కేటాయించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పేదల గృహ అవసరాలను తీర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అమృత్ పథకం కింద రూ.100 కోట్ల వ్యయంతో ఇంటింటికి తాగునీరు అందించే పనులు జరుగుతున్నాయని, ఆరు నెలల్లో వాటిని పూర్తి చేసి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎండాకాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్లే వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
