Let's talk: editor@tmv.in
బాత్రూమ్ క్లీనర్లతో కల్తీ నెయ్యి.. గత పాలనలో పవిత్రతకు పాతర: చంద్రబాబు

బాత్రూమ్ క్లీనర్లతో కల్తీ నెయ్యి.. గత పాలనలో పవిత్రతకు పాతర: చంద్రబాబు

Panthagani Anusha
7 ఫిబ్రవరి, 2026

తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదమైన లడ్డూ విశిష్టతను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా కలుగోట్ల గ్రామంలో జరిగిన గ్రామ సభలోనూ, ఎమ్మిగనూరులో పట్టాదార్ పాస్‌బుక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ ఆయన ప్రసంగిస్తూ.. గత ఐదేళ్ల పాలనలో తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వుతో పాటు బాత్రూమ్లు శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలను కలిపారని ఆరోపించారు. కేవలం తిరుమలనే కాకుండా ప్రసిద్ధ శ్రీశైలం ఆలయానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా అయ్యిందని ఆయన పేర్కొన్నారు.

జంతువుల కొవ్వుతో అపవిత్రం

వెంకటేశ్వర స్వామి అంటే కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. అటువంటి దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం దేవునికి వ్యతిరేకంగా చేసిన అతిపెద్ద పాపం" అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు జాతీయ పాడి అభివృద్ధి బోర్డు నివేదిక స్పష్టం చేసిందని ఆయన పునరుద్ఘాటించారు. వృక్ష సంబంధిత రసాయనాలు ఖరీదైనవనిఅందుకే తక్కువ ధరకు లభించే జంతువుల కొవ్వును, ప్రమాదకర రసాయనాలను కలిపి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ప్రస్తుతం టీటీడీలో ప్రక్షాళన చేపట్టామని నాటికీ నేటికీ లడ్డూ నాణ్యతలో స్పష్టమైన మార్పు వచ్చిందని ఆయన వివరించారు.

క్లీన్ చిట్ వాదనలపై ఆగ్రహం

వైఎస్సార్‌సీపీ నేతలు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చేస్తున్న వాదనలను ముఖ్యమంత్రి కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలో ఎవరినీ వదిలిపెట్టే ప్రసంగం లేదని, సిట్ నివేదిక అందాక మరిన్ని దిద్దుబాటు చర్యల కోసం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 2022లోనే సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదిక నెయ్యి కల్తీని గుర్తించినా అప్పటి ప్రభుత్వం ఆ అక్రమాలను ఆపకుండా కొనసాగించిందని ఆయన ఆరోపించారు. భక్తుల విశ్వాసానికి విఘాతం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరోవైపు వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. 2022 నివేదికలో నెయ్యి నాణ్యత సరిగా లేదని పేర్కొన్నారే తప్ప, ఎక్కడా జంతువుల కొవ్వు ప్రస్తావన లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ నివేదికను తాను అణిచివేశానన్న ఆరోపణల్లో నిజం లేదని తానే స్వయంగా నమూనాలను పరీక్షకు పంపానని ఆయన గుర్తుచేశారు. సిట్ దర్యాప్తులో ఇంకా ఏమీ తేలకముందే ప్రభుత్వం తప్పుడు ప్రచారంతో తమ పార్టీపై బురదజల్లుతోందని సుబ్బారెడ్డి విమర్శించారు.

బాత్రూమ్ క్లీనర్లతో కల్తీ నెయ్యి.. గత పాలనలో పవిత్రతకు పాతర: చంద్రబాబు - Tholi Paluku