
బాణాసంచా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
పండుగల సీజన్ ముందుగా రావడంతో పటాకుల తయారీ, నిల్వ, రవాణా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బిజ్నోర్ జిల్లాలో లైసెన్సుతో నడుస్తున్న ఒక బాణాసంచా కర్మాగార కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా సంభవించిన పేలుడు, మంటలతో ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదు.
ఈ ఘటన నహ్తౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిక్రీ ఖుర్ద్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో భుదేవ్ సింగ్కి చెందిన ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించింది. భూదేవ్ సింగ్‌కు చెందిన ఈ ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీకి సెప్టెంబర్ 5, 2029 వరకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ధాంపూర్ సర్కిల్ ఆఫీసర్ (సీఓ) అభయ్ కుమార్ పాండే తెలిపిన వివరాల ప్రకారం ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక కార్మికుడు ప్రమాదవశాత్తు గన్‌పౌడర్‌ను కింద పడేయడంతో ఈ విస్ఫోటం పేలుగరిగిందని అంతేకాక ప్రమాదం కారణంగా కర్మాగారానికి కప్పి ఉంచిన టిన్ షెడ్డు పూర్తిగా కాలిపోయింది అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు గాయపడిన కార్మికులను ఆశిష్, బాలేష్, అరుణ్‌లను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు . కాగా వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.
లైసెన్స్ ఉన్న ఫ్యాక్టరీలో ప్రమాదం జరగడం పట్ల పేలుడు పదార్థాల నిర్వహణకు సంబంధించిన భద్రతా నియమాలు ఎంతవరకు పాటించారనే దానిపై అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన పటాకుల పరిశ్రమలో ఉన్న అంతర్గత ప్రమాదాలను మరోసారి గుర్తుచేసింది.
