
బాగ్దాద్‌లో హై అలర్ట్: అమెరికా లక్ష్యాలపై దాడులకు కుట్ర!
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా లక్ష్యాలే ధ్యేయంగా భారీ ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరించింది. గురువారం జారీ చేసిన ఈ అత్యవసర భద్రతా అలర్ట్‌లో.. వచ్చే 24 నుంచి 48 గంటలు (శనివారం వరకు) అత్యంత కీలకమని పేర్కొంది. ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూపులు మధ్య బాగ్దాద్ ప్రాంతంలో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని, అమెరికన్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
అమెరికా సంస్థలే లక్ష్యంగా దాడులు
ఇరాన్ అనుకూల ఉగ్రవాద ముఠాలు గతంలోనూ అమెరికా పౌరులు, ఇరాక్ కుర్దిస్థాన్ ప్రాంతంలోని లక్ష్యాలపై దాడులకు పాల్పడిన విషయాన్ని ఎంబసీ గుర్తు చేసింది. శుక్ర, శనివారాల్లో అమెరికాకు చెందిన వ్యాపార సంస్థలు, విశ్వవిద్యాలయాలు, దౌత్య కార్యాలయాలు, ఇంధన మౌలిక సదుపాయాలు, హోటళ్లు, విమానాశ్రయాలపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. అంతేకాకుండా అమెరికన్లను అపహరించే (కిడ్నాప్) చేసే ముప్పు కూడా పొంచి ఉందని భద్రతా సలహా పత్రంలో పేర్కొంది.
ప్రభుత్వ గుర్తింపు కార్డులతో మిలిటెంట్ల ముసుగు
స్థానిక పరిస్థితులపై ఎంబసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇరాక్ ప్రభుత్వం తమ భూభాగం నుంచి జరుగుతున్న ఉగ్రవాద దాడులను అరికట్టడంలో విఫలమైందని విమర్శించింది. ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూపులకు చెందిన వ్యక్తులు ఇరాక్ ప్రభుత్వ ఉద్యోగులుగా చలామణి అవుతున్నారని, వారు అధికారిక గుర్తింపు కార్డులను కూడా కలిగి ఉండవచ్చని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో బాగ్దాద్‌లోని రాయబార కార్యాలయం లేదా ఎర్బిల్‌లోని కాన్సులేట్‌ను సందర్శించవద్దని పౌరులకు గట్టిగా సూచించింది.
తక్షణమే ఇరాక్ విడిచి వెళ్లాలని ఆదేశం
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికా విదేశాంగ శాఖ ఇరాక్‌కు 'లెవల్-4' (ప్రయాణించవద్దు) హెచ్చరికను జారీ చేసింది. ఏ కారణం చేతనైనా ఇరాక్‌కు వెళ్లవద్దని, ఇప్పటికే అక్కడ ఉన్న పౌరులు తక్షణమే దేశాన్ని విడిచి రావాలని ఆదేశించింది. అక్కడ కొనసాగడం ప్రాణాపాయంతో కూడుకున్న వ్యవహారమని స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఇరాక్ గగనతలం మూసివేసి ఉండటంతో వాణిజ్య విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దీనివల్ల పౌరులు జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, టర్కీ సరిహద్దుల గుండా రోడ్డు మార్గంలో ప్రయాణించాలని సూచించింది. సరిహద్దుల వద్ద రద్దీ కారణంగా జాప్యం జరిగే అవకాశం ఉన్నప్పటికీ, అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను వాడుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఎంబసీ స్పష్టం చేసింది.
అమెరికా జర్నలిస్ట్ కిడ్నాప్.. దర్యాప్తు ముమ్మరం
మరోవైపు బాగ్దాద్‌లో అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ షెల్లీ కిటిల్సన్ కిడ్నాప్‌నకు గురైనట్లు అమెరికా విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. ఆమె భద్రతపై గతంలోనే హెచ్చరికలు జారీ చేసినట్లు గ్లోబల్ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ సెక్రటరీ డైలాన్ జాన్సన్ తెలిపారు. బాధితురాలిని క్షేమంగా విడిపించేందుకు ఎఫ్‌బీఐతో కలిసి సమన్వయం చేసుకుంటున్నామని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు.
