
బాగ్దాద్‌లో అమెరికా మహిళా జర్నలిస్టు కిడ్నాప్
ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో మంగళవారం పట్టపగలే ఒక అమెరికా మహిళా జర్నలిస్టు కిడ్నాప్‌నకు గురవ్వడం అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తోంది. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్న షెల్లీ కిటిల్సన్ నగరం నడిబొడ్డున ఉన్న సాదూన్ వీధిలో నిలబడి ఉండగా, ఇద్దరు వ్యక్తులు బలవంతంగా ఆమెను కారులోకి నెట్టి తీసుకెళ్లారు. ఈ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఇరాక్ భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమై కిడ్నాపర్ల వాహనాన్ని వెంబడించగా, బాగ్దాద్‌కు నైరుతి దిక్కున ఉన్న బాబిల్ ప్రావిన్స్ వద్ద ఒక వాహనం బోల్తా పడింది. అయితే దుండగులు ఆమెను మరో కారులోకి మార్చి తప్పించుకున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
హెచ్చరికలను పట్టించుకోని షెల్లీ
షెల్లీ కిటిల్సన్ గత కొన్నేళ్లుగా సిరియా, ఇరాక్ ప్రాంతాల్లో యుద్ధ వార్తలను కవర్ చేస్తున్నారు. అయితే తాజా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆమెకు ప్రాణహాని ఉందని అమెరికా విదేశాంగ శాఖ పలుమార్లు హెచ్చరించింది. కిడ్నాప్ జరగడానికి ముందు రోజు రాత్రి కూడా అధికారులు ఆమెను అప్రమత్తం చేసినట్లు సమాచారం. మూడు వారాల క్రితం ఆమె సిరియా సరిహద్దు నుంచి ఇరాక్‌లోకి రావాలని ప్రయత్నించగా, ప్రెస్ పర్మిట్ లేకపోవడంతో అధికారులు తిప్పి పంపారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వీసాపై ఆమె బాగ్దాద్ చేరుకుని ఒక హోటల్‌లో బస చేశారు.
మిలీషియా హస్తంపై అనుమానాలు
ఈ కిడ్నాప్ వెనుక ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలీషియా గ్రూపు 'కతైబ్ హెజ్బొల్లా' హస్తం ఉండవచ్చని అమెరికా అధికారులు భావిస్తున్నారు. కిడ్నాప్‌నకు వాడిన ఒక వాహనాన్ని సీజ్ చేసిన ఇరాక్ పోలీసులు, పట్టుబడ్డ ఒక నిందితుడికి ఈ మిలీషియా గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. గతంలో కూడా ఎలిజబెత్ సుర్కోవ్ అనే విదేశీయురాలిని ఇదే గ్రూపు కిడ్నాప్ చేసి, 2025లో విడుదల చేసిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా పౌరులపై దాడులు, కిడ్నాప్ ముప్పు పెరుగుతుందని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరిస్తూనే ఉంది.
ముమ్మరంగా గాలింపు చర్యలు
ఇరాక్ ప్రధానమంత్రి మొహమ్మద్ షియా అల్-సుడానీ నేరుగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. షెల్లీని బాగ్దాద్‌లోనే ఎక్కడో ఒకచోట బంధించి ఉంచారని ఇరాక్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. అరెస్టయిన నిందితుడిని విచారించడం ద్వారా ఆమె ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా ప్రభుత్వం కూడా ఇరాక్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఆమె పనిచేస్తున్న 'అల్-మానిటర్' సంస్థ తన రిపోర్టర్ భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, షెల్లీని వెంటనే సురక్షితంగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
