Let's talk: editor@tmv.in
బాగా చదవండి.. మీకు మేమున్నాం

బాగా చదవండి.. మీకు మేమున్నాం

FL - SIMHCLM
8 అక్టోబర్, 2025

విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది ఆకాంక్షించారు. అనారోగ్యానికి గురై చికిత్స పొంది పార్వతీపురం జిల్లా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 16 మంది విద్యార్థులతో కలెక్టర్ మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అనారోగ్యానికి గురై త్వరగా కోలుకొని తమ ఇళ్లకు వెళుతున్న విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవద్దని, ఏ సమస్య వచ్చినా మేమున్నామని, అన్ని విధాల ఆదుకుంటామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. గురుకుల పాఠశాలకు అవసరమైన ఆర్.ఓ ప్లాంట్ సిద్దమైందని, కొత్త మరుగుదొడ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇంకా ఇతర సదుపాయాలు, మౌలిక వసతులు అవసరమైతే కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, చదువుతో పాటు పరిశుభ్రత పాటించాలని సూచించారు. పరిశుభ్రత లోపంతోనే అనారోగ్యానికి గురవుతారని, కావున ప్రతి ఒక్కరూ భోజనానికి ముందు, తదుపరి, అలాగే మరుగుదొడ్లు వినియోగం తదుపరి సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చి వడగట్టిన నీటినే తాగాలని విద్యార్థులకు సూచించారు. ఇలా చేయడం వలన దాదాపు 90 శాతం వ్యాధులు రాకుండా నివారించవచ్చని అన్నారు. విద్యార్థులు పాఠశాలలో ఉన్నా, ఇంటి వద్ద ఉన్నా ఈ అలవాటును కచ్చితంగా పాటించాలని, మీతో పాటు మీ తల్లితండ్రులకు, స్నేహితులకు, బంధువులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

బాగా చదవండి.. మీకు మేమున్నాం - Tholi Paluku