
బాక్సామ్ ఎలైట్ 2026లో భారత్ శుభారంభం
బాక్సామ్ ఎలైట్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్-2026లో భారత బాక్సర్లు తమ జైత్రయాత్రను ఘనంగా ప్రారంభించారు. టోర్నీ తొలిరోజే తమ పంచ్ పవర్ చూపిస్తూ మెజారిటీ విభాగాల్లో విజయాలను నమోదు చేశారు. 21 దేశాల నుంచి 214 మంది బాక్సర్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్‌లో భారత బాక్సర్లు తమ ఆధిపత్యాన్ని చాటుతున్నారు.
హితేష్, ప్రీతిల ఏకపక్ష పోరాటం
వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్ విజేతలు హితేష్ గులియా, ప్రీతిలు తమ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ ఏకపక్ష విజయాలతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. పురుషుల 70 కేజీల విభాగంలో హితేష్ గులియా నెదర్లాండ్స్‌కు చెందిన ఫిన్ బాస్‌పై 5-0తో ఘనవిజయం సాధించాడు. రింగులో చాలా ప్రశాంతంగా కనిపిస్తూనే, ప్రత్యర్థిపై మెరుపు వేగంతో పంచ్‌లు కురిపించిన హితేష్.. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు తన పట్టును కోల్పోలేదు. అటు మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి సైతం కజకిస్థాన్‌కు చెందిన అలియాస్కర్ సింబాత్‌ను 5-0తో చిత్తు చేసింది. పక్కా వ్యూహంతో ప్రత్యర్థిని డిఫెన్స్‌లో పడేసి తన పంచ్‌లతో ఆకట్టుకుంది.
రింగులో మహిళల జోరు
మహిళల విభాగంలో భారత్ నుంచి ప్రాచీ (57 కేజీలు), ప్రియ (60 కేజీలు), కాజల్ (65 కేజీలు) కూడా ముందడుగు వేశారు. ప్రాచీ తన పంచ్‌లతో స్పెయిన్ బాక్సర్ వనేసా మోరెల్‌పై 5-0తో విజయం సాధించగా.. ప్రియ కెనడాకు చెందిన అలెస్సియా మాన్సుయెట్టోను 5-0తో ఓడించింది. కాజల్ కొంచెం కష్టపడి కజకిస్థాన్‌కు చెందిన అసిమ్ తనతార్‌పై 4-1తో గెలుపొందింది.
దూసుకెళ్లిన పురుషుల బృందం
పురుషుల విభాగంలోనూ భారత్ విజయాల పరంపర కొనసాగింది. 60 కేజీల విభాగంలో సచిన్ స్పెయిన్ బాక్సర్‌పై 5-0తో గెలవగా, మొహమ్మద్ హుసాముద్దీన్ 4-1తో డెన్మార్క్ బాక్సర్ మతియాస్‌ను మట్టికరిపించాడు. అభి నాష్ జమ్వాల్ (65 కేజీలు) 5-0తో క్లీన్ స్వీప్ చేయగా.. దీపక్ (70 కేజీలు), ఆకాష్ (75 కేజీలు), అంకుష్ (80 కేజీలు) తమ ప్రత్యర్థులపై 4-1 చొప్పున విజయాలు సాధించి తర్వాతి రౌండ్‌కు చేరుకున్నారు. అయితే, 65 కేజీల విభాగంలో ఆదిత్య ప్రతాప్ యాదవ్ మాత్రం ఇంగ్లండ్ బాక్సర్ జో టర్నర్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
