
‘బాకీ కార్డు’ పేరుతో బద్నాం చేస్తారా?
ఇటీవల బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు పేరుతో ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ ఇంటింటికి తిరిగి బాకీ కార్డులను ప్రచారం చేస్తోంది. తాజాగా ఈ ప్రచారాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తప్పు పట్టారు. బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి.. ఇప్పుడు ఎందుకు నీతులు చెబుతున్నారని ప్రశ్నించారు. మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్ అప్పులకు మేమే వడ్డీ కడుతున్నాం
బీఆర్ఎస్ చేసిన 'బాకీ' (అప్పులు)లకు తామే వడ్డీలు కడుతున్నామని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బకాయిల గురించి మాట్లాడాలంటే, మొదట ముద్దాయిగా నిలబడేది కేసీఆర్ అని ఆయన వ్యాఖ్యానించారు. మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ నాయకులకు 'బకాయి' అనే పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా లేదన్నారు.
బీఆర్ఎస్‌కు చురకలు
బీఆర్ఎస్‌కు కూడా చురకలు అంటించారు. బీఆర్ఎస్ బాకీ కార్డు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, ఆ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను కూడా గుర్తు చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 'ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం', 'దళిత బంధు', 'మూడెకరాల భూమి', 'కేజీ టూ పీజీ ఉచిత విద్య', 'ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్లు' వంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
అవినీతిలో ఆరితేరారు
బీఆర్ఎస్ పార్టీ నేతలు అవినీతిలో ఆరితేరిపోయారని విమర్శించారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేస్ వంటి అంశాలతో పాటు పలు ప్రభుత్వ పథకాల్లో బీఆర్ఎస్ చేసిన స్కాంలు ఒక్కొక్కటిగా బయట పడుతుండటంతో, దిక్కుతోచక మోసపూరిత 'బాకీ కార్డు ప్రచారం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనను నవాబుల పాలనతో పోల్చిన ఆయన, ఈ పాలన తెలంగాణను సర్వ నాశనం చేసిందని విమర్శించారు.
బీఆర్ఎస్ రేషన్ కార్డులు బాకీ పడ్డది
తెలంగాణలో 40 లక్షల మందికి రేషన్ కార్డులు బీఆర్ఎస్ బాకీ పడలేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్న హామీల అమలును బీఆర్ఎస్ 'బకాయి'గా పేర్కొనడంపై మహేష్ కుమార్ గౌడ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రూ.500 సబ్సిడీతో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఆరోగ్య శ్రీని రూ.10 లక్షలకు పెంచడం, నిరుద్యోగుల కోసం వేలాది ఉద్యోగాలు ఇవ్వడం, రైతులకు రుణమాఫీ చేయడం, రైతు భరోసా, వరికి బోనస్ ఇవ్వడం వీటిని ‘బకాయి పడటం’అంటారా? అని ఆయన బీఆర్ఎస్‌ను ప్రశ్నించారు.
ఇచ్చిన మాట ప్రకారం రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం కూడా 'బకాయి' అవుతుందా అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రచారం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి సహకరించకుండా నష్టం కలిగిస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
జీఎస్టీ పేరుతో దోపిడీ
జీఎస్టీ పేరుతో కేంద్రంలోని బీజేపీ వేల కోట్లు దోచుకుందని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మైత్రి కొనసాగుతుందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై సవాల్ బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులకు బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోడీని అడిగే దమ్ము ఉందా అని ఆయన సవాల్ విసిరారు. బీసీల నోటి కాడా ముద్ద లాక్కునే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కుల సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పారదర్శకంగా నిర్వహించిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను ప్రశ్నించే హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు.
