
బాకీకార్డు ఉద్యమం.. ఓ బ్రహ్మస్తం
బీఆర్ఎస్ మొదలుపెట్టిన బాకీకార్డు ఉద్యమం బ్రహ్మాస్త్రం లాంటిదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించడం మొదలైందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరి, కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజలు మరచిపోయారని భ్రమలో ఉన్నారని, అయితే ప్రజలకు అన్నీ గుర్తున్నాయని పేర్కొన్నారు. ‘బాకీ కార్డు’ ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నామన్నారు. ఇది కాంగ్రెస్ పతనానికి కారణమవుతుందని ఆయన హెచ్చరించారు. కాగా కాంగ్రెస్ నేతలు ఈ విమర్శలను తోసిపుచ్చుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారిపోయిందని, అప్పుల భారం పెరిగిందని ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టి, హామీల అమలుకు ప్రాధాన్యత ఇస్తోందని వారు స్పష్టం చేస్తున్నారు.
సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం
హైదరాబాద్ నగర అభివృద్ధిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో ఫిడేల్ వాయించినట్టు, హైదరాబాద్ సమస్యలతో కుదేలవుతుంటే రేవంత్ రెడ్డి కొత్త నగరం నిర్మాణం గురించి మాటలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. చెత్త సమస్య, డ్రైనేజీ పొంగిపొర్లడం, వీధి దీపాలు లేకపోవడం వంటి సమస్యలను ఎత్తిచూపారు. కేసీఆర్ హయాంలో 42 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించామని, కాంగ్రెస్ ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు. అయితే, కాంగ్రెస్ వర్గాలు ఈ ఆరోపణలను ఖండిస్తూ, బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ అభివృద్ధి అసమానంగా ఉందని, గ్రామీణ ప్రాంతాలు వెనుకబడ్డాయని పేర్కొంటున్నాయి. రేవంత్ సర్కార్ హైదరాబాద్‌తోపాటు మొత్తం రాష్ట్రాన్ని సమానంగా అభివృద్ధి చేయడానికి ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టును చేపట్టిందని, ఇది దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని వివరిస్తున్నారు. మున్సిపల్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఆగ్రహంగా వృద్ధులు, నిరుద్యోగులు
రాష్ట్రంలో రైతులు, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, విద్యార్థులు కాంగ్రెస్ పాలనపై ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ ఆరోపించారు. గత కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం రైతులు క్యూలైన్లలో చెప్పులు పెట్టేవారని, నేడు మళ్లీ అదే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రజలు తిరిగి కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని ఆయన అన్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాలను కొనసాగిస్తూ, ఎరువుల సరఫరాను మెరుగుపరుస్తోందని పేర్కొంటోంది. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సరైన మద్దతు ధర లభించలేదని, అప్పులు పెరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వృద్ధులకు పెన్షన్ పెంపు వంటి హామీలను అమలు చేస్తున్నామని, నిరుద్యోగులకు ఉద్యోగాల సృష్టి కోసం ప్రయత్నాలు చేస్తున్నామని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2023 ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని కేటీఆర్ గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీతను బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రదీప్ చౌదరి చేరికతో బీఆర్ఎస్ బలోపేతమవుతుందని అన్నారు.
బాకీ కార్డు ఉద్యమంతో ఫాయిదా ఎంత?
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 'ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రభుత్వం 22 నెలలు గడిపేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ కార్డులో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్ వంటి హామీలు ఎందుకు అమలు కావడం లేదు? ప్రతి వర్గానికి ఎంత 'బాకీ' పడిందో వివరాలు ఉన్నాయి. ఉదాహరణకు, ఒక్కో మహిళకు రూ.55,000, వృద్ధునికి రూ.44,000 బాకీ ఉందని కార్డులో పేర్కొన్నారు. ఈ ఉద్యమం ద్వారా ప్రజలను మేల్కొల్పి, కాంగ్రెస్ మోసాలను బట్టబయలు చేయడమే లక్ష్యమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికిని చాటుకునేందుకు ఈ కార్డును ఉపయోగించుకుంటున్నది. అయితే ప్రజల నుంచి ఎంతవరకు స్పందన వస్తుందో వేచి చూడాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం కౌంటర్ ఆరోపణలు చేస్తోంది. బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీల సంగతేంటని వారు ప్రశ్నిస్తున్నారు. దళిత సీఎం, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలను బీఆర్ఎస్ పార్టీ ఇచ్చి వాటిని పక్కన పడేసిందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
కాంగ్రెస్‌పై వ్యతిరేకత నిజమేనా?
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యల్లో విఫలమైందని, గ్రామీణ పాలన పూర్తిగా కుప్పకూలిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. గ్రామాల్లో విద్యుత్ కోతలు, నీటి కొరత, యూరియా లభ్యత లేకపోవడం వంటి సమస్యలు ప్రజలను విసిగించాయి. "కేసీఆర్ పాలనలో మెరుగైన సౌకర్యాలు ఉండేవి, ఇప్పుడు మోసపోయాము" అని రైతులు, పల్లె ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
బీఆర్ఎస్‌కు కలిగే ప్రయోజనాలు ఏమిటి?
బీఆర్ఎస్ ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఓ వైపు కేసీఆర్ మీద కేసులు, మరోవైపు కేసీఆర్ కూతురు కవిత నుంచి వస్తున్న విమర్శలతో ఆ పార్టీ సతమతం అవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే విమర్శలు బాకీ కార్డు లాంటి ఉద్యమాలు తెరమీదకు వచ్చాయి. గతంలోనూ రైతు సమస్యలు, నీటి వాటాలు వంటి అంశాలపై కూడా బీఆర్ఎస్ నిరసన తెలిపింది. తాజాగా 'బాకీ కార్డు' ఉద్యమం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చడం లేదని చెప్పే ప్రయత్నం చేస్తోంది. తద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని వర్గాలు బీఆర్ఎస్ పార్టీ మీద కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ అసంతృప్తిని వాడుకొని రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నం చేస్తోంది. మరి ఈ బాకీ కార్డు ఉద్యమం నిజంగానే బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి ఉపయోగ పడుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.
