
బాండీ బీచ్‌లో కాల్పుల వెనుక 'ఇస్లామిక్ స్టేట్' హస్తం: ఆస్ట్రేలియా పోలీసులు
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ప్రఖ్యాత బాండీ బీచ్ వద్ద హనుక్కా (యూదుల పండుగ) వేడుకల సమయంలో జరిగిన సామూహిక కాల్పుల ఘటన 'ఇస్లామిక్ స్టేట్' (ఐసీస్) ప్రేరణతో జరిగిన ఉగ్రదాడి అని ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్ క్రిస్సీ బారెట్ మంగళవారం వెల్లడించారు.
ఈ దాడిలో మొత్తం 15 మంది మరణించారు. ఆదివారం జరిగిన ఈ కాల్పుల్లో చిన్నారులు సహా అనేక మంది గాయపడ్డారు. ఇంకా 25 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో ముగ్గురు పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తండ్రి–కొడుకు ప్రధాన నిందితులు
ఈ దాడికి సంబంధించి 50 ఏళ్ల తండ్రి, 24 ఏళ్ల కుమారుడు నిందితులుగా పోలీసులు గుర్తించారు. తండ్రి పోలీసుల కాల్పుల్లో మరణించాడు. కుమారుడు గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలోనే అధికారులు తొలిసారిగా నిందితుల భావజాలంపై అధికారికంగా వివరాలు వెల్లడించారు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ మాట్లాడుతూ, దాడి ఐసిస్ ప్రేరణతో జరిగిందని నిర్ధారించే ఆధారాలు లభించాయని చెప్పారు.
నిందితుల వాహనంలో ఐసిస్ జెండాలు, ఇంట్లో తయారు చేసిన పేలుడు పరికరాలు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర పోలీస్ కమిషనర్ మాల్ లాన్యన్ మాట్లాడుతూ, వాహనంలో రెండు స్వయంగా తయారు చేసిన ఐసిస్ జెండాలు ఉన్నాయని ధ్రువీకరించారు.
హనుక్కా వేడుకలపై దాడి
దాడి జరిగిన సమయంలో బాండీ బీచ్‌లో యూదుల పండుగ అయిన హనుక్కా వేడుకలు జరుగుతున్నాయి. కాల్పుల్లో మరణించినవారిలో 10 ఏళ్ల చిన్నారి నుండి 87 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి ధైర్యంగా ఒక దాడి చేసిన వ్యక్తిని కింద పడేసి ఆయుధాన్ని లాక్కున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆయుధాన్ని నేలపై పెట్టి ఇతరులను కాపాడినందుకు అతడిని ప్రజలు ప్రశంసిస్తున్నారు.
ఆయుధాల చట్టాలపై కఠిన చర్యలు
ఈ ఘటన తర్వాత ఆస్ట్రేలియాలో గన్ చట్టాలపై తీవ్ర చర్చ మొదలైంది. ఇప్పటికే కఠినంగా ఉన్న ఆయుధాల నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని ప్రధాని అల్బనీస్ ప్రకటించారు.
నిందితుడు చట్టబద్ధంగానే ఆరు ఆయుధాలు కొనుగోలు చేసినట్లు బయటపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 1996లో టాస్మేనియాలోని పోర్ట్ ఆర్థర్‌లో జరిగిన కాల్పుల తర్వాత ఇంత పెద్ద మార్పులు చేయడం ఇదే మొదటిసారి కావొచ్చని అధికారులు చెబుతున్నారు.
విదేశీ ప్రయాణాలపై విచారణ
నిందితులు గత నెల ఫిలిప్పీన్స్‌కి ప్రయాణించినట్లు పోలీసులు తెలిపారు. వారు అక్కడికి ఎందుకు వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? ఎవరిని కలిశారు? అన్న అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.
ప్రజల్లో భయం, ఆగ్రహం
ఈ దాడి తర్వాత ఆస్ట్రేలియాలో యూదులపై పెరుగుతున్న ద్వేషంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడిని ఎలా ప్లాన్ చేశారు? ముందస్తు భద్రత ఎందుకు కల్పించలేకపోయారు? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. “నిందితులకు బాధితుల వయస్సు, పరిస్థితి ఏమీ పట్టలేదు. ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశంతోనే దాడి చేసినట్లు తెలుస్తోంది” అని పోలీస్ కమిషనర్ క్రిస్సీ బారెట్ అన్నారు. ఈ ఘటనతో ఆస్ట్రేలియా మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠినంగా స్పందిస్తామని, ప్రజల భద్రతే తమ ప్రాధాన్యత అని హామీ ఇచ్చింది.
