
బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు
ఆదివారం బహ్రెయిన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ విమానాన్ని వెంటనే ముంబైకి మళ్లించగా, అక్కడ అది సురక్షితంగా ల్యాండ్ అయిందని పోలీసులు తెలిపారు.
విమానాశ్రయ అధికారుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బాంబు ఉంచినట్టు పేర్కొంటూ వచ్చిన కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసర చర్యలు తీసుకున్నారని తెలిపారు. ముంబైలో విమానం దిగిన తర్వాత సీఐఎస్ఎఫ్, బాంబు స్క్వాడ్ స్థానిక పోలీసు బృందాలు సమగ్రంగా తనిఖీలు నిర్వహించాయి.
విమానంలోని సామాను, కేబిన్, కార్గో విభాగాల్లో పరిశీలనలు జరిపినప్పటికీ ఏ అనుమానాస్పద వస్తువూ కనిపించలేదని అధికారులు ధృవీకరించారు. దీంతో ఆ బెదిరింపు పూర్తిగా పుకారు మాత్రమేనని తేలింది.బాంబు బెదిరింపు పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని, విమాన కార్యకలాపాలు మామూలు స్థితికి చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు.
