Let's talk: editor@tmv.in
బహుజనులను కేంద్రం బహిరంగంగా మోసం చేస్తోంది: రాహుల్ గాంధీ

బహుజనులను కేంద్రం బహిరంగంగా మోసం చేస్తోంది: రాహుల్ గాంధీ

Pinjari Chand
4 డిసెంబర్, 2025

కులగణన (కాస్ట్ సెన్సస్) పై ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరి బహుజనులపై బహిరంగ ద్రోహమని కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. పార్లమెంట్‌లో తాను వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం షాకింగ్ గా ఉందని ఆయన అన్నారు. కులగణన తదుపరి జనగణన గురించి మంగళవారం లోక్‌సభలో రాహుల్ మూడు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ సమాధానాన్ని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్ లో కోట్ చేస్తూ స్పందించారు.

‘కులగణనపై ప్రభుత్వానికి ఏ స్పష్టమైన రూపురేఖలు లేవు. నిర్ణీత కాలపట్టిక లేదు. పార్లమెంట్‌లో చర్చ లేదు. ప్రజలతో సంభాషణ లేదు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన కులగణన నమూనాలనుంచి నేర్చుకోవాలన్న కోరిక కూడా లేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం బహుజనుల పట్ల ప్రభుత్వం చేస్తున్న ‘బహిరంగ ద్రోహం’ అని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ సంధించిన మూడు ప్రశ్నలు

• తదుపరి జనగణన ప్రక్రియలో కీలక దశలు, దాని కాల క్రమ పట్టిక వివరాలేమిటి?

• ప్రజల సూచనల కోసం ముసాయిదా ప్రశ్నావళిని విడుదల చేసే ఆలోచన ఉందా?

• రాష్ట్రాల్లో నిర్వహించిన కులగణనల నుంచి ఏవైనా ఉత్తమ పద్ధతులను అనుసరిస్తున్నారా?

2027లో రెండు దశల్లో జనగణన

మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించిన వివరాల ప్రకారం జనగణన 2027లో రెండు దశల్లో నిర్వహించనున్నారు.

మొదటి దశ : 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో, రాష్ట్రాలు/యూటీల సౌలభ్యానికి అనుగుణంగా 30 రోజుల వ్యవధిలో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సర్వే

రెండో దశ: 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కింపు

సూచిక తేదీ: 2027 మార్చి 1 అర్ధరాత్రి

లడాఖ్, జమ్మూకశ్మీర్‌లోని మంచు ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మాత్రం 2026 సెప్టెంబర్‌లోనే జనాభా లెక్కింపు జరుగుతుంది.

సూచిక తేదీ: 2026 అక్టోబర్ 1 అర్ధరాత్రి

ప్రశ్నావళి రూపకల్పన విధానం

కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సర్వే డేటా వినియోగదారుల సూచనల ఆధారంగా ప్రతిసారి జనగణన ప్రశ్నావళి తయారు చేస్తారు. ఫీల్డ్ ట్రయల్స్ అనంతరం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా తుది రూపం ఇస్తారని మంత్రి తెలిపారు. 150 ఏళ్లకు పైగా కొనసాగుతున్న జనగణన చరిత్రలో ప్రతి విడతలో వచ్చిన అనుభవాలనూ పరిగణనలోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. తద్వారా అన్ని భాగస్వామ్య పక్షాల నుంచి సూచనలు తీసుకుంటామని తెలిపారు.

బహుజనులను కేంద్రం బహిరంగంగా మోసం చేస్తోంది: రాహుల్ గాంధీ - Tholi Paluku