Let's talk: editor@tmv.in
బహిరంగ సభలపై నిర్ధిష్ట ప్రణాళిక అవసరం

బహిరంగ సభలపై నిర్ధిష్ట ప్రణాళిక అవసరం

Pinjari Chand
30 సెప్టెంబర్, 2025

దేశంలో భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి ఓ మెరుగైన మార్గాన్ని, సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ అన్నారు. సోమవారం సహచర మంత్రి మురుగన్​ తో కలిసి కరూర్ తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబాలను ఆమె సోమవారం పరామర్శించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్​ లో పునరావృత్తం కాకుండా దేశ వ్యాప్తంగా సరైన విధానాన్ని తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ప్రచార ర్యాలీకి వచ్చిన వారికి కనీసం నీరు, ఆహారం అందుబాటులో లేవని, ఈ విషయాన్ని చాలా మంది చెప్పారని, అలాగే టీవీకే విజయ్​ కోసం చాలా సేపు ఎదురుచూశారని కేంద్రమంత్రి వాపోయారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారని, సానుభూతి తెలిపారని వివరించారు. ప్రధాని కరూర్​ లో బాధితులను పరామర్శించాలని సూచించారని, ఆయన వివిధ పనుల వలన ఇక్కడికి రాలేకపోయారని వివరించారు.

బాధితులకు అండగా ఉంటాం

ఈ ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారికి ఏ సహయం కావాలన్నా ప్రభుత్వాన్ని సంప్రదించాలని తెలిపారు. తొక్కిసలాటలో మరణించిన వారిలో ఎక్కువ మంది పేదవారేనని ఆమె అన్నారు. అన్ని కుటుంబాలను కలవలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. కలెక్టర్​ కూడా బాధితుల వివరాలు అందించారు. ఇక్కడి విషయాలను ప్రధానికి వివరిస్తానని చెప్పారు. సీబీఐ దర్యాప్తు గురించి మీడియా ప్రశ్నించినప్పుడు ఆ విషయం తన పరిధిలో లేదన్నారు. ప్రధాని ప్రకటించిన పరిహారం గురించి సీతారామన్ మాట్లాడుతూ బాధిత కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పరిహారం వచ్చేలా చేస్తానని, ఇక్కడి బాధితుల నుంచి వారి బ్యాంక్​ ఖాతాలు సేకరించామన్నారు. ఈ విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. మృతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.2 లక్షలు ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల సాయం అందిస్తామన్నారు.

ఆసుపత్రిలో బాధితులకు భరోసా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళనాడు బిజెపి చీఫ్ నైనార్ నాగేంద్రన్ కరూర్ తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు, వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాటలో మరణించిన 5 ఏళ్ల ప్రదీప్ అమ్మమ్మ నాగమణితో మాట్లాడారు. ప్రదీప్ తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. మరో బాధితురాలు పళనియమ్మాళ్ మాట్లాడుతూ కేంద్రమంత్రులు అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ ఈ సంఘటన గురించి ఆరా తీశారని చెప్పారు.ఏదైనా సహాయం కావాలంటే బిజెపి జిల్లా అధ్యక్షుడిని సంప్రదించాలని కూడా ఆమె అన్నారు.ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి భరోసానిచ్చారు.

బహిరంగ సభలపై నిర్ధిష్ట ప్రణాళిక అవసరం - Tholi Paluku