
బీహార్ తొలి మహిళా ఫిడే మాస్టర్‌గా మరియం ఫాతిమా
దేశంలో చెస్ క్రీడ అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది తమిళనాడే. ఈ రాష్ట్రం నుంచి చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్ మాస్టర్స్ డి.గుకేష్, ప్రజ్ఞానంద వంటి వారు ప్రపంచ వేదికలపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో బీహార్ రాష్ట్రానికి చెందిన యువ క్రీడాకారిణి మరియం ఫాతిమా కూడా చేరారు. బీహార్ ముజఫర్‌పూర్‌కు చెందిన మరియం ఫాతిమా అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) నుంచి మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్యూఐఎం) హోదాను సాధించి చరిత్ర సృష్టించారు. బీహార్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి మహిళా చెస్ క్రీడాకారిణిగా నిలిచారు.
ఏమిటీ డబ్యూఐఎం టైటిల్?
మహిళా ఇంటర్నేషనల్ మాస్టర్ (డబ్యూఐఎం) అనేది అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఇచ్చే ఒక ప్రతిష్టాత్మక టైటిల్. సాధారణంగా ఈ టైటిల్ సాధించాలంటే క్రీడాకారిణి 2,100 లేక అంతకంటే ఎక్కువ ఫిడే రేటింగ్‌ను పొందాలి. ఇటీవల స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన బార్బెరా డెల్ వల్లెస్ ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మరియం అద్భుతమైన ప్రదర్శన కనబరిచి తన రేటింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుంది. ఈ ప్రదర్శన ఆధారంగానే ఆమెకు ఫిడే గుర్తింపు లభించింది.
మరియం భవిష్యత్ లక్ష్యాలు
మరియం ఫాతిమా తన విజయాన్ని తన తల్లిదండ్రులకు, బీహార్ చెస్ అసోసియేషన్ అధికారులకు అంకితం చేశారు. తన తదుపరి లక్ష్యం గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించడమని ఆమె తెలిపారు. గ్రాండ్‌మాస్టర్ హోదాకు 2,400 రేటింగ్ అవసరమని పేర్కొంటూ ప్రస్తుతం బీహార్ నుంచి ఏ ఒక్కరూ గ్రాండ్ మాస్టర్ లేరని, తాను ఆ ఘనత సాధించి రాబోయే యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నట్లు చెప్పారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మహిళా గ్రాండ్‌మాస్టర్లు మాత్రమే ఉన్నారు, మరియం తొమ్మిదో మహిళా గ్రాండ్‌మాస్టర్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నారు.
బీహార్ చెస్ అసోసియేషన్ హర్షం
ఫాతిమా సాధించిన ఈ విజయంపై బీహార్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి ధర్మేంద్ర కుమార్, సంయుక్త కార్యదర్శి నందకిషోర్ శ్రీవాస్తవ, ముజఫర్‌పూర్ చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ కుమార్, కార్యదర్శి హిమాన్షు కుమార్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. మరియం కేవలం బీహార్‌కే కాకుండా, యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచిందని వారు ప్రశంసించారు.
