Let's talk: editor@tmv.in
బీహార్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పోరు

బీహార్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పోరు

FL - BRTH
19 సెప్టెంబర్, 2025

బీహార్ ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం పార్టీల మధ్య జరుగుతున్న పోరు.. రాజకీయంగా రసవత్తరంగా మారింది. అటు ఇండియా ఇటు ఎన్డీఏ రెండు కూటమిలోని పార్టీలు ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నాయి. ఎవరికెవరూ తక్కువ కాదు అన్నట్టు వ్యవహరించడం బీహార్ ఎన్నికల నేపథ్యంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, మరోవైపు కూటమి పార్టీల సీట్ల సర్దుబాటు బీహార్ ఎన్నికల ముఖచిత్రంలో ఎప్పుడూలేనంత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి ఒక ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. బీహార్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే.. ముఖ్యమంత్రి ఎవరు ? ఈ ప్రశ్నతో రాహుల్ గాంధీ ఆత్మరక్షణలో పడ్డారు. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయంలో ఇండియా కూటమిలో స్పష్టత లేదు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా, దాటవేయడం ద్వారా తాము కూడా రేసులో ఉన్నామనే పరోక్ష ప్రకటన రాహుల్ గాంధీ చేశారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీహార్ లో ఇండియా కూటమి గెలిస్తే తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది భావిస్తున్నారు. కానీ సీఎం ఎవరన్న ప్రశ్నపై రాహుల్ గాంధీ స్పందించిన తీరుతో ఆర్జేడీకి రాహుల్ గాంధీ ఒక స్పష్టత ఇచ్చారు. తాము కూడా రేసులో ఉన్నామని ప్రకటించారు. ఆర్జేడీ కూడా సీట్ల సర్దుబాటులో రాజీపడటం లేదు. అవసరమైతే అన్ని సీట్లలో పోటీ చేస్తామని స్పష్టం చేసింది. పరోక్షంగా ఇండియా కూటమిలో ఉండబోమని చెప్తోంది.

సీట్ల సర్దుబాటు పోరు ఇండియా కూటమికి మాత్రమే పరిమితం కాలేదు. ఎన్డీఏ కూటమికి కూడా ఆ సెగ తగిలింది. ఎన్టీఏలోని లోక్ జనశక్తి పార్టీ.. ఎన్టీఏ నుంచి బయటికి వచ్చే అవకాశం కూడా తమకు ఉందంటూ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ 40 సీట్లను కోరుతున్నారు. తమకు ప్రతి నియోజకవర్గంలో 20 నుంచి 25 వేల ఓట్లు ఉన్నాయని చిరాగ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఎన్డీఏలో ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలోనే చిరాగ్ పాశ్వాన్ పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు. చిరాగ్ పాశ్వాన్ పార్టీకి బీహార్ లో దాదాపు 6 శాతం ఓటు బ్యాంకు ఉంటుంది. ఇప్పుడది కీలకం. ఎన్డీఏ నుంచి చిరాగ్ బయటికి వస్తే ఎన్నికల్లో బీజేపీకి నష్టం. అంతిమంగా ఇండియా కూటమికి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఎన్డీఏ చిరాగ్ పాశ్వాన్ ను బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చింది. మరోవైపు తమ పార్టీ కార్యకర్తలు తనను సీఎంగా చూడాలని భావిస్తున్నారని చిరాగ్ పాశ్వాన్ మాట్లాడటం ఆసక్తికర చర్చకు తెరలేపింది.

అటు ఇండియా కూటమిలో ఆర్జేడీ ఎక్కవ సీట్ల కోసం పట్టుపట్టడం, ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తూ ఉండటం.. ఇటు ఎన్డీఏలో ఎల్జేపీ ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తూ, ముఖ్యమంత్రి కావాలనే ఆశను వ్యక్తం చేయడం కాంగ్రెస్, బీజేపీలకు రుచించడం లేదు. అలాగని ఆర్జేడీని కాంగ్రెస్, ఎల్జేపీని బీజేపీ కాదనుకోలేవు. ఎందుకంటే బీహార్ లో గెలవాలంటే కులాల కాంబినేషన్ చాలా అవసరం. ఆర్జీడీ వెనుక యాదవులు, ఎల్జేపీ వెనుక పాశ్వాన్లు ర్యాలీ అవుతారు. కాబట్టి కాంగ్రెస్, బీజేపీలకు ఆర్జేడీ, ఎల్జేపీల మద్దతు అవసరం. కానీ ఆ పార్టీల డిమాండ్లు కాంగ్రెస్, బీజేపీలకు రుచించడం లేదు. జాతీయ పార్టీలుగా ఆధిపత్యాన్ని కోరుతున్నాయి. కానీ బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఆర్జేడీ, ఎల్జేపీ తాము లేకుండా గెలవడం సాధ్యం కాదన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ సీట్ల సర్దుబాటు పోరు ఆసక్తికరంగా మారింది.

బీహార్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు పోరు - Tholi Paluku