
బహరంపూర్‌లో అధీర్ చౌధురీ ఎంట్రీ.. హీటెక్కిన రాజకీయ పోరు
బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలోని పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలోని బహరంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. దీంతో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే సుబ్రత మైత్రా, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నారు గోపాల్ ముఖర్జీ, ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధురీ మధ్య ఉత్కంఠ పోరు ఉండనుంది. అయితే అక్కడి ఎన్నికలను లోతుగా పరిశీలిస్తే, బహరంపూర్‌లో గెలుపోటములను ప్రధానంగా రెండు అంశాలు ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి మత ఆధారిత ఓటర్ల ధ్రువీకరణ కాగా, మరొకటి మూడు దశాబ్దాల విరామం తర్వాత అధీర్ రంజన్ చౌధురీ రాష్ట్ర శాసనసభ రాజకీయాల్లోకి మళ్లీ రావడం.
ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన అధీర్ రంజన్ చౌధురీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఆయన బహరంపూర్‌లో తిరిగి తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు రంగంలోకి దిగారు. ఒకప్పుడు కాంగ్రెస్‌కు బలమైన కోటగా ఉన్న ఈ ప్రాంతంలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా ఎదిగింది. 2021 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుబ్రత మైత్రా (కంచన్) సుమారు 27 వేల ఓట్ల మెజారిటీతో తృణమూల్ అభ్యర్థి నారు గోపాల్ ముఖర్జీని ఓడించి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ చక్రవర్తి మూడో స్థానానికి పరిమితమయ్యారు. స్వతంత్ర భారత చరిత్రలో బహరంపూర్ నుంచి గెలిచిన తొలి బీజేపీ ఎమ్మెల్యేగా మైత్రా నిలిచారు.
బహరంపూర్‌కు చారిత్రక ప్రాధాన్యత కూడా ఉంది. 1757లో ప్లాసీ యుద్ధం అనంతరం ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో తన మొదటి కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. తరువాత ఇది వాణిజ్య, ఉత్పత్తి రంగాలకు ముఖ్య కేంద్రంగా ఎదిగింది. బ్రిటిష్‌వారితో పాటు డచ్, ఫ్రెంచ్ వ్యాపారులు కూడా ఇక్కడికి ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో బహరంపూర్ మున్సిపాలిటీతో పాటు ఐదు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిలో రెండు ముస్లిం ఆధిక్యత ఉన్న ప్రాంతాలు.
బీజేపీ ఇంటింటి ప్రచారం
ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే మైత్రా భారీ సభల కంటే ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజుకు సుమారు 500 ఇళ్లను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు హిందువులకే కాదు ముస్లింలకూ సమానంగా లబ్ధి చేకూరుస్తున్నాయి. కానీ బంగ్లాదేశ్ నుంచి అక్రమ ప్రవేశాలు పెరగడం వల్ల లా అండ్ ఆర్డర్ దెబ్బతింటోంది. ఉద్యోగాలు, ఆహార వనరులపై కూడా ప్రభావం పడుతోంది. దీనికి తోడు తృణమూల్ కాంగ్రెస్ అవినీతి, బలప్రయోగం ప్రజలను విసిగిస్తున్నాయని మైత్రా అన్నారు.
నా ఓటమికి అవే కారణాలు
ఇక కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురీ మాట్లాడుతూ 2021లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనకు ఎన్‌ఆర్సీ-సీఏఏ వ్యతిరేక ఉద్యమాలు, కూచ్ బీహార్ జిల్లాలోని సీతల్కుచిలో కేంద్ర బలగాల కాల్పుల వంటి అంశాలు కారణమని పేర్కొన్నారు. ఆ పరిస్థితులను మమతా బెనర్జీ రాజకీయంగా ఉపయోగించుకుని ముఖ్యంగా ముస్లిం ఓటర్లను ఆకర్షించారని ఆయన అన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర మత కారణాల వల్ల నేను ఓడిపోయాను. తరువాత ప్రజలు ఆ నిర్ణయంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈసారి ప్రజల మద్దతు నాకు లభిస్తుందని చౌధురీ విశ్వాసం వ్యక్తం చేశారు.
అధీర్ ప్రభావం కోల్పోయారు
అయితే తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి నారు గోపాల్ ముఖర్జీ మాత్రం త్రిముఖ పోరును ఖండిస్తూ, చౌధురీ ఇప్పుడు ప్రభావం కోల్పోయారని అన్నారు. అధీర్ చౌధురీ ఇప్పుడు బహరంపూర్‌లో అంత కీలకమైన అంశం కాదు. అయితే ఆయన గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేవారు. ఆయన ఇప్పుడు రాజకీయంగా నిలబడటానికే పోటీ చేస్తున్నారు. అసలు పోరు తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉందని ముఖర్జీ తెలిపారు. 2021లో ముఖర్జీ ఓటు శాతం సుమారు 12.5 శాతం పెరిగినా, బీజేపీ అభ్యర్థి మైత్రా దాదాపు 45 శాతం ఓట్లు సాధించి విజయం సాధించారు. 2016తో పోలిస్తే బీజేపీ ఓటు శాతం 35 శాతం కంటే ఎక్కువగా పెరగడం విశేషం. అయితే మైత్రా మాత్రం చౌధురీని పూర్తిగా విస్మరించలేమని చెబుతూ, ఆయన ఒకే సమాజాన్ని ప్రోత్సహించి మరొక సమాజాన్ని విస్మరించారని ఆరోపించారు. ముర్షీదాబాద్ జిల్లాలో ముస్లింలు అధికంగా ఉన్నప్పటికీ, బహరంపూర్ నియోజకవర్గంలో దాదాపు 70 శాతం ఓటర్లు హిందువులే. ఇటీవలి కాలంలో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో చోటుచేసుకున్న మత ఉద్రిక్తతలు, బెల్దంగా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బాబ్రీ మసీదు అంశం కూడా ఎన్నికలపై ప్రభావం చూపుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
భద్రతే ప్రధాన ఆందోళన
స్థానిక జర్నలిస్టు ఒకరు మాట్లాడుతూ బహరంపూర్ ప్రజలకు ప్రధాన ఆందోళన భద్రత అంశమే. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి హింసకు గురైన హిందువులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అందుకే మూడు ప్రధాన పార్టీలు కూడా హిందూ అభ్యర్థులనే నిలబెట్టాయి. ఎవరు భద్రత కల్పిస్తామని ప్రజలకు వాగ్ధానం చేస్తారో వారు విజయం సాధించే అవకాశం ఉందన్నారు. ఇక స్థానిక పరిశీలకుల అభిప్రాయం ప్రకారం అధీర్ రంజన్ చౌధురీ తిరిగి రంగప్రవేశం చేయడం ఎన్నికల పోరుకు కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. 40 ఏళ్లకు పైబడిన ఓటర్లలో అధీర్ చౌధురీపై ఇప్పటికీ అభిమానం ఉంది. ఆయన హిందూ, ముస్లిం ఓటర్లలోనూ కొంత మద్దతు పొందే అవకాశం ఉంది. దీని వల్ల తృణమూల్, బీజేపీ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ పోరు చాలా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం స్పష్టమైన విజేత ఎవరూ కనిపించడం లేదని బహరంపూర్‌కు చెందిన రిటైర్డ్ కళాశాల ప్రిన్సిపల్ సమరేశ్ మండల్ అన్నారు.
