
బస్సు చార్జీల పెంపుపై కేటీఆర్ ఆగ్రహం
సిటీ బస్సుల చార్జీల పెంపు నిర్ణయంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఒకేసారి రూ. 10 పెంచడం ద్వారా జంట నగరాల్లోని పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస చార్జీపై కనికరం లేకుండా అదనపు బస్సుల్లోనూ 50 శాతం ధరలను పెంచడం రేవంత్ అసమర్థ విధానాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో అల్లాడుతున్న తరుణంలో ప్రతి ప్రయాణికుడిపై నెలకు దాదాపు రూ. 500 అదనపు భారం మోపితే బడుగుజీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ప్రయాణికులపై కక్షేనా?
ఇప్పటికే విద్యార్థుల బస్ చార్జీలు, టీ-24 టిక్కెట్ ధరలను పెంచింది చాలదన్నట్టు, ఇప్పుడు కనీస చార్జీపైనా 50 శాతం వడ్డన సరికాదని కేటీఆర్ అన్నారు. రాజధాని వాసుల నడ్డివిరిచి ప్రతినిత్యం దాదాపు కోటి రూపాయల భారం మోపాలని చూస్తున్న ముఖ్యమంత్రికి హైదరాబాద్ ప్రజలపై కక్ష పెంచుకుంటున్నట్టు అర్థమవుతోందని ఆయన మండిపడ్డారు.
ఫ్రీ బస్సుతో ఆర్టీసీ దివాలా
ఫ్రీ బస్సు పథకంతో దివాళా తీసిన ఆర్టీసీని గట్టెక్కించాల్సిందిపోయి, సామాన్య ప్రయాణికుల నడ్డి విరచాలని చూడటం క్షమించరానిదని కేటీఆర్ విమర్శించారు. పండుగ సమయంలో నడిపే అదనపు బస్సుల్లో సైతం 50 శాతం అదనపు ఛార్జీలు మోపుతూ ప్రజలపై భారం మోపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. జంట నగరాల్లో బస్ చార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమైందని, మరోసారి పునరుద్ఘాటించారు. ఈ పెంపును ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
