Let's talk: editor@tmv.in
బస్సులోనే బతుకులు బుగ్గిపాలు

బస్సులోనే బతుకులు బుగ్గిపాలు

Pinjari Chand
25 అక్టోబర్, 2025

ఆనందంగా హైద్రాబాద్ నుంచి బెంగుళూరుకు బస్సులో ప్రయాణమయ్యారు. సిటీ దాటాక నిద్రకు ఉపక్రమించారు. ప్రయాణం సాఫీగా సాగుతోంది. కర్నూల్ శివారులు దాటి కల్లూరు మండలం చిన్నటేకూర్ దాటాక ఘోరం జరిగిపోయింది. బస్సులో మంటలు వ్యాపించాయి. దీంతో నిద్రలోనే కొంతమంది మృత్యుఒడిలోకి జారుకున్నారు. మరి కొంతమంది సాటి ప్రయాణికులను అప్రమత్తం చేసి వారు బస్సులో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగిలినవారు బస్సులో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు చుట్టుముట్టాయి. కేకలు వేసినా వినేవారు కరువయ్యారు. దూకిన వారు కాపాడదామంటే మంటలు దావానంలా వ్యాపించాయి. బస్సులో ఉన్నవారు క్రమంగా అగ్నికి అహుతయ్యారు. ఒక్కసారిగా బయటివారు హతాశులయ్యారు.

తెల్లవారుజామున సాగిన ఈ ప్రయాణం మృత్యు యాత్రగా మారింది. కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం దేశాన్నే దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రజలను పెను విషాదంలో ముంచివేసింది.

హైదరాబాదు నుంచి బెంగళూరు వైపు ప్రయాణికులతో బయలుదేరిన వేమూరీ కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ వోల్వో బస్సు ప్రమాదానికి గురై మంటల్లో కాలిపోయి 19 మంది సజీవ దహనమయ్యారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరికొందరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ప్రమాదం ఎలా జరిగింది?

తెల్లవారుజామున 3 గంటల సమయంలో బస్సు చిన్నటేకూరు గ్రామం వద్ద హైవేపై వేగంగా దూసుకుపోతూ ఉన్నది. ఈ సమయంలో కర్నూల్ ప్రజానగర్ నుంచి ఆరోడ్డు పై వెళుతున్న శివశంకర్ అనే వ్యకి బైక్​ పై వెళుతుండగా బస్సు ఢీకొట్టింది. ఢీకొట్టిన తర్వాత బస్సు డ్రైవర్ ఆపకుండా అలాగే వేగంగా ముందుకు వెళ్లడంతో బైక్ బస్సు చక్రాల క్రింద ఇరుక్కుపోయింది. కొన్ని క్షణాల్లోనే పెట్రోల్ ట్యాంక్ పేలి మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే బస్సు అంతా మంటల్లో చిక్కుకుంది. రాత్రి సమయం, అందులో నిద్రకు గోల్డెన్ అవర్ కావడంతో చాలామంది ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా బయటకు రావడానికి సమయం దొరకలేదు. ఒక క్షణంలోనే ఉధృతమైన మంటలు మొత్తం బస్సుని కమ్మేశాయి. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కొందరు కిటికీలు పగలగొట్టి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతావారు బయటకు రాకముందే మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందారు.

బస్సులో ప్రయాణికులు

మొత్తం 43 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు బస్సులో ఉన్నట్లు సమాచారం. అందులో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 23 మంది ప్రాణాలు కాపాడుకున్నారు. బస్సు డ్రైవర్ గాయాలతో బయటపడ్డాడు.అయితే ప్రయాణికులను కాపాడదామన్న ప్రయత్నం చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. దీంతో వారి ఇంట్లోనూ విషాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

సహాయ చర్యలు

అటుగా వెళుతున్న ప్రయాణికులైన హైద్రాబాద్ కు చెందిన హేమారెడ్డి, హరీశ్ తదితర వ్యక్తులు మానవత్వంతో స్పందించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది, స్థానికులు అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. గాయపడిన వారిని వెంటనే కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఆవరణ రోదనలు, ఆర్తనాదాలతో నిండిపోయింది. తల్లిదండ్రులు, బంధువులు బతికిన వారిని వెతుకుతూ విలపించారు. స్థానికులను ఈ దృశ్యాలు కలిచివేశాయి.

ప్రాణాలు కాపాడుకున్న వారి మాటల్లో

‘మంటలు చెలరేగిన వెంటనే పొగతో ఊపిరాడక అల్లాడిపోయాం. ఎమర్జెన్సీ గేటు తెరుచుకోలేదు. విండో గ్లాస్ పగలగొట్టి దూకక తప్పలేదు. లోపల ఉన్నవారి కేకలు ఈ జీవితంలో మరవలేం’ అని సుబ్రమణ్యం అనే ప్రయాణకుడు తెలిపారు.

‘బస్సులో అద్దాలు పగలగొడుతున్న శబ్దానికి మెలకువ వచ్చింది. అప్పటికే బస్సులో పొగ కమ్ముకుంది. డోర్ తెరవడానికి ప్రయత్నం చేస్తే రాలేదు. అక్కడ ఉన్న వారు నన్ను కిందకు లాగారు.దీంతో ప్రాణాలు కాపాడుకున్నా’ అని మరో ప్రయాణికుడు తెలిపారు.

కారణం అతివేగమేనా?

ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం అని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత స్పార్క్స్ వల్లే మంటలు చెలరేగినట్టు తేల్చారు. బస్సు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ పత్రాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. అయితే ఈ బస్సుపై తెలంగాణలో ఓవర్ స్పీడ్, ప్రమాదకరంగా బస్సు నడపడం వంటి తదితర కారణాలతో 16 చలాన్లు విధించారు.

సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కేటీఆర్ తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక సహాయాన్ని ప్రకటించింది. ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం ఇస్తామని కేంద్రం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసులకు ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు ప్రకటించింది.

అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం; హోం మంత్రి వంగలపూడి అనిత

సంఘటన స్థలాన్ని హోం మినిస్టర్ వంగలపూడి అనిత పరిశీలించారు. ఆమెతో పాటు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్, డీఐజీ, పోలీసులతో మాట్లాడారు. ఆసుపత్రిలో బాధితులతో మాట్లాడారు, అందుతున్న వైద్య సేవలను గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. డ్రైవర్లను అరెస్ట్ చేశామన్నారు. అలాగే ప్రమాదంలో మృతదేహాలు బాగా కాలిపోయినందున ఘటన స్థలంలోనే డీఎన్ఏ పరీక్షలు చేసి, వాటి ఆధారంగా బంధువులకు అప్పగిస్తామన్నారు. అన్ని కొణాల్లో కేసును దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. నంద్యాల ఎంపీ శబరి కూడా సంఘటన జరిగినప్పటి నుంచి అక్కడే ఉండి అందుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఆమె స్వయాన డాక్టర్ కావడంతో వీలైనంత వైద్య సహాయం అందించారు. తెలంగాణ నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ, తదితర అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. మంత్రి జూపల్లి కూడా ఘటనాస్థలానికి వెళ్లి, సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు.

కలచివేసిన దృశ్యాలు

నెల్లూరు జిల్లాకు చెందిన కుటుంబ సభ్యులు గొల్ల రమేష్ (35), అనూష (30), మన్విత (10), మనీష్ (12) ఈ ప్రమాదంలో మరణించారు. కుటుంబం అంతా కలిసి హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరింది. ఈ కుటుంబంలోని నలుగురూ బస్సు మధ్యభాగంలో కూర్చున్నారని, బయటకు రాకముందే మంటల్లో చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.బాధిత కుటుంబాల ఆవేదన మిన్నంటింది. బస్సులో ప్రయాణిస్తున్న వారు సాఫ్ట్​ వేర్ ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబసభ్యులు. కొందరు దీపావళి తర్వాత తిరిగి పనికి వెళ్తున్నవారు ఉన్నారని సమాచారం. ఒక్క క్షణంలో బూడిదైన బస్సు దృశ్యం చూసిన వారంతా కన్నీరు కార్చారు.

పరిశీలనలో అనేక కోణాలు

• బస్సు ఓడిశాలో రిజిస్ట్రేషన్, అయితే డియూ (డమన్ డయ్యూ)లో మొదట రిజిస్టర్ అయిందని ట్రాన్స్‌పోర్ట్ అధికారులు తెలిపారు.

• మోటార్ వాహన చట్టం ప్రకారం ఇలాంటి బస్సులపై సాంకేతిక భద్రతా పర్యవేక్షణ తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

• ప్రయాణ బస్సుల్లో అత్యవసర ద్వారాలు, ఎగ్జిట్ సూచనలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు ఉండాలనే చర్చ మళ్లీ మొదలైంది.

బస్సులోనే బతుకులు బుగ్గిపాలు - Tholi Paluku