
బస్సులు తాత్కాలికంగా నిలిపివేత !
హైదరాబాద్‌లో భారీ వర్షాలతో మూసీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరడంతో టీజీఆర్టీసీ తాత్కాలికంగా ఎంజీబీఎస్ నుంచి బస్సుల రాకపోకలను నిలిపివేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని, ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి నడుపుతున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం, కొన్ని ప్రధాన మార్గాల్లో బస్సులు కొత్త ప్రదేశాల నుంచి వెళ్లనున్నాయని ప్రకటించారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపునకు వెళ్లే బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి నడుస్తున్నాయి. వరంగల్, హన్మకొండ ప్రాంతాలకు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్ నుంచి అందుబాటులో ఉంటాయి. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడకు వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి బయలుదేరతాయి. మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపునకు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి నడుపుతున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఎంజీబీఎస్‌కి రావద్దని టీజీఆర్టీసీ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ ద్వారా విజ్ఞప్తి చేసింది. బస్సులు తాత్కాలికంగా మారిన ప్రాంతాల నుంచి మాత్రమే నడుస్తున్నాయని, ప్రయాణికులు తమ గమ్యస్థానానికి వెళ్లాలంటే ఆయా ప్రాంతాలకు చేరుకుని బస్సులు ఎక్కాలని అధికారులు సూచించారు. మరింత సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
