
బస్తర్ లో భీకర ఎన్‌కౌంటర్
బస్తర్ ప్రాంతం తుపాకీ కాల్పులతో దద్దరిల్లింది. ఎదురు కాల్పులతో మార్మోగ్రింది. నక్సల్స్ కు, భద్రతా దళాలకు మధ్య రెండు వేర్వేరు ఘటనల్లో జరిగిన పోరులో 14 మంది నక్సల్స్ నేలకూలారు. దీంతో మావోయిస్టు ఉద్యమానికి తీరని నష్టం జరిగింది. సంఘటన స్థలం నుంచి భద్రతా సిబ్బంది ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సుక్మా జిల్లా కిస్టారం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) సిబ్బంది 12 మంది(ఐదుగురు మహిళలు) మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిలో సీనియర్ కేడర్ సచిన్ మాంగ్టు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం నుంచి ఆటోమేటిక్ ఆయుధాలను కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇదే సమయంలో, బీజాపూర్ జిల్లా గగన్‌పల్లి గ్రామ సమీపంలో జరిగిన మరో ఎదురుకాల్పులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో హుంగా మడ్కం అనే మావోయిస్టు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన స్థలం నుంచి ఏకే-47, ఇన్సాస్ రైఫిళ్లు సహా ఇతర ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
భద్రతా దళాలకు నష్టం లేదు
ఈ రెండు ఆపరేషన్లలో భద్రతా సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. సంవత్సర ఆరంభంలోనే జరిగిన ఈ చర్యలను వామపక్ష తీవ్రవాదంపై సాధించిన కీలక విజయంగా అధికారులు అభివర్ణించారు. భారత్ ప్రభుత్వం 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో, ఈ ఎదురుకాల్పులు కీలకంగా మారాయని అధికారులు పేర్కొన్నారు.
ఇంటెలిజెన్స్ ఆధారంగా ఆపరేషన్
దక్షిణ బస్తర్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టుల ఉనికిపై స్పష్టమైన గూఢచార సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందాలను మోహరించారు. అధికారుల ప్రకారం బీజాపూర్‌లో ఉదయం 5 గంటల నుంచి, సుక్మాలో ఉదయం 8 గంటల నుంచి డీఆర్జీ సిబ్బంది, మావోయిస్టుల మధ్య విడతల వారీగా కాల్పులు కొనసాగుతున్నాయి. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. అందులో ఏకే-47 తుపాకులు, ఇన్సాస్ , ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు ఉన్నట్లు తెలిపారు.
బీజాపూర్‌లో వేర్వేరు ఎదురుకాల్పులు
బీజాపూర్ జిల్లాలో జరిగిన మరో ఎదురుకాల్పులో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. దక్షిణ బీజాపూర్ ప్రాంతంలో చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా డీఆర్జీ బృందాలు పాల్గొన్నాయి. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందరరాజ్ మాట్లాడుతూ ఉదయం 5 గంటల నుంచి డీఆర్జీ సిబ్బంది, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగాయి. ఈ ఆపరేషన్ సమయంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇంతకు ముందు విడుదల చేసిన ప్రకటనలో, 2025 సంవత్సరం బస్తర్ రేంజ్‌కు చారిత్రాత్మక, నిర్ణాయక సంవత్సరంగా నిలిచిందని అధికారులు తెలిపారు. 2025 సంవత్సరం భద్రత, శాంతి, న్యాయం, అభివృద్ధి రంగాల్లో విశేష పురోగతిని సాధించింది. ఖచ్చితమైన గూఢచార సమాచారం ఆధారంగా చేపట్టిన నక్సల్స్ వ్యతిరేక చర్యలతో వారి కార్యకలాపాలపై స్పష్టమైన నియంత్రణ సాధించాం. ఇది బస్తర్‌లో శాశ్వత శాంతికి బలమైన పునాది వేసిందని అన్నారు. భద్రతా పరిస్థితులు మెరుగుపడటంతో రహదారులు, కమ్యూనికేషన్, వైద్యం, విద్య వంటి మౌలిక సదుపాయాలు విస్తరించాయని, అలాగే దూర ప్రాంతాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరుతున్నాయని ప్రకటనలో తెలిపారు.
డీఆర్జీ కీలక పాత్ర
ఈ ప్రాంతంపై ఉన్న స్థానిక పరిజ్ఞానం, గూఢచారి సమాచారం కారణంగా భద్రతా బృందాలు మావోయిస్టుల ఉనికిని క్రమంగా తగ్గించడంలో విజయవంతమవుతున్నాయని తెలిపారు. దీంతో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం రోజు రోజుకు క్షీణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బస్తర్ రేంజ్‌లో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా భద్రతా దళాలు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. వీరిలో బీజాపూర్ జిల్లా నుంచి ఇద్దరు, సుక్మా జిల్లా నుంచి 12 మంది నక్సల్స్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
గత హింసాత్మక ఘటనల్లో పాత్ర
వెట్టీ మాంగ్డు – కాంటా ఏరియా కమిటీ ఇన్‌చార్జ్, మాడ్వీ హితేష్ అలియాస్ హుంగా – అదే కమిటీ కార్యదర్శి గా గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మిగిలిన మావోయిస్టుల గుర్తింపు ఇంకా జరగాల్సి ఉందన్నారు. అయితే మాంగ్డు, హుంగా ఇద్దరూ గత ఏడాది జూన్‌లో కాంటా ప్రాంతంలో జరిగిన ఐఈడీ పేలుడు ఘటనలో అప్పటి అదనపు ఎస్పీ (కాంటా) ఆకాశ్‌రావ్ గిరేపుంజే మృతి చెందిన ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 2025 జూన్ 9న డొండ్రా గ్రామ సమీపంలోని రాయి గనుల వద్ద నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలుడులో ఎస్పీ గిరేపుంజే మృతి చెందగా, మరో ఇద్దరు పోలీస్ అధికారులు గాయపడ్డారు.
బస్తర్‌కు కొత్త దిశ – సీఎం
ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి మాట్లాడుతూ బస్తర్‌లో ఇప్పుడు హింసకు చోటు లేదు. నమ్మకం, అభివృద్ధి, భద్రతే కొత్త దిశలు. పెట్టుబడులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో బస్తర్ ముందుకు సాగుతోంది అన్నారు. ఇంకా హింస మార్గాన్ని ఎంచుకున్న నక్సలైట్లు లొంగిపోయి ప్రధాన ప్రవాహంలోకి రావాలని, ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకుని గౌరవప్రదమైన జీవితం గడపాలని సీఎం విజ్ఞప్తి చేశారు. లేకపోతే చట్టం, రాజ్యాంగ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. 2025లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో 285 మంది నక్సలైట్లు హతమయ్యారు. 2026 మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న లక్ష్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది.
