
బస్తర్‌లో అభివృద్ధికి నూతనోదయం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
మావోయిస్టులపై ప్రభుత్వం తీసుకున్న దృఢమైన చర్యల వల్ల బస్తర్ ప్రాంతంలో భయం, అనిశ్చితి వాతావరణం తొలగిపోయిందని, అక్కడ అభివృద్ధికి నూతన ఉదయం ఆవిర్భవిస్తున్నదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం పేర్కొన్నారు. బస్తర్ జిల్లా కేంద్రం జగదల్పూర్‌లో నిర్వహిస్తున్న మూడు రోజుల విభాగ స్థాయి బస్తర్ పాండుమ్ పండుగను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హింసను విడనాడి జనజీవనంలోకి వచ్చిన వారు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచాలని, శాంతి మార్గం నుంచి తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు లోనుకాకూడదని సూచించారు.
బస్తర్ తన సహజ సౌందర్యం, సంపన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలతో ఎప్పుడూ ప్రజలను ఆకర్షించింది. అయితే దురదృష్టవశాత్తూ, మావోయిజం కారణంగా ఈ ప్రాంతం ఎన్నో సంవత్సరాలు బాధపడిందని రాష్ట్రపతి అన్నారు. నక్సలిజం వల్ల అత్యధికంగా నష్టపోయింది యువత, గిరిజనులు, దళితులేనని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధం ఉన్న పలువురు హింసను వదిలిపెట్టి ముందుకు రావడంతో బస్తర్‌లో మళ్లీ శాంతి నెలకొంటోందని తెలిపారు. మావోయిస్టులపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక చర్యల వల్ల భయం, అపనమ్మక వాతావరణానికి ముగింపు పలికిందని అన్నారు.
కష్టపడి ముందుకు సాగాలి
పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయారని తనకు సమాచారం అందిందని, జనజీవనం లోకి వచ్చిన వారు గౌరవప్రదమైన సాధారణ జీవితం గడిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని ఆమె చెప్పారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నియాద్ నెల్లనార్’ వంటి పథకాల ద్వారా గ్రామాల సాధికారత పెరుగుతోందని రాష్ట్రపతి ప్రశంసించారు. గ్రామాలకు విద్యుత్, రహదారులు, తాగునీరు అందుబాటులోకి వస్తోందని, ఎన్నేళ్లుగా మూతపడిన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయని పేర్కొంటూ, దీనిని ‘అత్యంత హృద్యమైన దృశ్యం’గా అభివర్ణించారు. ప్రభుత్వ ప్రయత్నాలు, ప్రజల సహకారంతో బస్తర్‌లో అభివృద్ధికి నూతన ఉదయం ఉదయిస్తోందని ఆమె అన్నారు. ప్రజలు వ్యవస్థపై నమ్మకం ఉంచి, కష్టపడి, అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం దేశ బలానికి మూలమని పేర్కొన్నారు. హింసను విడిచిపెట్టి జనజీవనంలోకి వచ్చిన వారు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంచాలి. వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రపతి పునరుద్ఘాటించారు.
పీఎం జన్మన్, ధర్తి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష యోజన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వెనుకబడిన గ్రామాలను అభివృద్ధితో అనుసంధానిస్తున్నట్లు ఆమె తెలిపారు. విద్యే వ్యక్తి, సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొన్న రాష్ట్రపతి, గిరిజన పిల్లల విద్యాభివృద్ధి కోసం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు గిరిజన ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయని తెలిపారు. తన స్వంత జీవన ప్రయాణాన్ని ప్రస్తావించిన ద్రౌపది ముర్ము, ఒడిశాలోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన కుమార్తె ఈ రోజు మీ ముందు భారత రాష్ట్రపతిగా మాట్లాడుతున్నది అంటే, భారత ప్రజాస్వామ్య బలానికి ఇదే నిదర్శనం. మీలో ఇంకా ఎక్కువ ధైర్యం, శక్తి ఉంది. ప్రభుత్వం మీ వెంటే ఉందని అన్నారు. పేదలు, నిరుపేదలు, వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
ఛత్తీస్‌గఢ్‌ను వెనుకబడిన రాష్ట్రంగా భావించేవారు. కానీ అది నిజం కాదు. దాని వైభవాన్ని చూడండి. ఈ రాష్ట్రం అపారమైన సాంస్కృతిక సంపదతో నిండి ఉంది. ఇందుకు కారణం ఇక్కడి గిరిజన ప్రజలే. వారి సంస్కృతి అమూల్యమైనది—ప్రాచీనమైనదైనా ఎంతో అందమైనది. సమానత్వం, సమ్మేళనాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే పాండుమ్ పండుగను చూడాలని రాష్ట్రపతి అన్నారు. బస్తర్ ప్రాంతానికి విస్తారమైన పర్యాటక అవకాశాలు ఉన్నాయని, ఉత్సాహభరితమైన ప్రజలు, ప్రాచీన సంస్కృతి, సహజ సౌందర్యం, జలపాతాలు, గుహలే ఇందుకు కారణమని చెప్పారు. అవసరమైన సదుపాయాలు మెరుగుపడితే మరింత మంది పర్యాటకులు ఆకర్షితులవుతారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా హోమ్‌స్టేలకు ఆదరణ పెరుగుతోందని, ఈ దిశగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా నిస్వార్థ సేవలు అందించినందుకు డాక్టర్ బుధ్రి టాటి, డాక్టర్ రాంచంద్ర గోద్‌బోలే, ఆయన భార్య సునీత గోద్‌బోలేలకు 2026 పద్మ అవార్డులు లభించడంపై రాష్ట్రపతి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ మాట్లాడుతూ ఒకప్పుడు బస్తర్ అంటే నక్సలిజం, భయమే గుర్తొచ్చేది. ఇప్పుడు పరిస్థితి వేగంగా మారుతోంది. ఒకప్పుడు తుపాకుల శబ్దం వినిపించిన ప్రాంతాల్లో ఇప్పుడు పాఠశాల గంటల శబ్దం వినిపిస్తోందని అన్నారు. 2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ గవర్నర్ రమేన్ డేకా తదితరులు పాల్గొన్నారు.
