
బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికలలో మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు పథకం హమీని అమలు చేశారు.
మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఎంత మేలు జరుగుతుందో కానీ ఆర్టీసీ సిబ్బందిని అంతకు మించి ఇబ్బందులకు గురి చేస్తోందనే చెప్పాలి. ఫ్రీ బస్సు పథకం పుణ్యమా అని బస్సుల్లో సామర్థ్యానికి మించి ఎక్కేస్తున్నారు. సిబ్బంది ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. పైగా ప్రయాణికులు వారితోనే వాగ్వాదానికి దిగుతున్నారు. డ్రైవర్, కండక్టర్లను తిట్టడమే కాకుండా పలు సందర్భాల్లో దాడులు కూడా చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఆర్టీసీ బస్సు ఆపలేదనే కారణంతో బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు మహబూబాబాద్ నుండి వరంగల్‌కు వెళ్తోంది. దన్నసరి క్రాస్ రోడ్ దగ్గరికి రాగానే డ్రైవర్ విష్ణుమూర్తి ప్రయాణికులు దిగేందుకు బస్సు ఆపాడు. అనంతరం బడి తండా స్టేజ్ వద్ద ఓ మహిళా ప్రయాణికురాలు బస్సును ఆపాలని సూచించింది. కానీ, అతను బస్సులో 92 మంది ప్రయాణికులు ఉన్నారని, వెనుక బస్సు వస్తుందని ఆమెకు సైగ చేస్తూ స్టేజ్ వద్ద నిలపకుండా ముందుకు సాగాడు. అక్కడి నుండి గాంధీ సెంటర్ ప్రాంతానికి చేరుకుని ప్రయాణికులు దిగేందుకు బస్సు ఆపాడు.
బస్సు ఆపలేదన్న కోపంతో సదరు మహిళను బడి తండాకు చెందిన బిక్షపతి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని బస్సు వద్దకు తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. వీరి మధ్య ఘర్షణ జరుగుతుండగా అక్కడే టీ స్టాల్ నిర్వహించే మహేందర్ వచ్చి డ్రైవర్‌ను పరుష పదజాలంతో దూషించి, డ్రైవర్‌పై దాడి చేశాడు. దీంతో డ్రైవర్ బస్సుతో పాటు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ ముందు నిలపడంతో బస్సులో ప్రయాణించే ప్రయాణికులు మరో బస్సులో తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు.
