Let's talk: editor@tmv.in
బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్!

బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్!

Shaik Mohammad Shaffee
22 సెప్టెంబర్, 2025

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవిపై గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. ఈ కీలక పదవికి మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ మిథున్ మన్హాస్ ఫేవరెట్‌గా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ ఆడకుండానే భారత క్రికెట్ బోర్డుకు నాయకత్వం వహించబోతున్న తొలి క్రికెటర్‌గా ఆయన రికార్డు సృష్టించనున్నారు. బీసీసీఐ అనధికారిక సమావేశంలో మన్హాస్ పేరు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఓ బీసీసీఐ ఉన్నతాధికారి మాట్లాడుతూ మన్హాస్ అధ్యక్ష పదవికి ఎంపికయ్యే అవకాశం దాదాపు 90 శాతం ఉందని తెలిపారు.

ఎవరీ మిథున్ మన్హాస్?

1979 అక్టోబర్ 12న జమ్మూ కశ్మీర్‌లో జన్మించిన మిథున్ మన్హాస్, తన క్రికెట్ కెరీర్‌ను ఢిల్లీలో ప్రారంభించారు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా, అప్పుడప్పుడు ఆఫ్-స్పిన్ బౌలర్‌గా ఆయన సుదీర్ఘమైన ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడారు. 18 సంవత్సరాల పాటు సాగిన తన కెరీర్‌లో ఆయన 157 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 9,714 పరుగులు చేశారు. ఇందులో 27 సెంచరీలు, 49 అర్ధ సెంచరీలున్నాయి. ఆయన బ్యాటింగ్ సగటు 45.82 కావడం విశేషం. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, పూణే వారియర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడారు. జమ్మూ కశ్మీర్ నుండి ఐపీఎల్‌లో ఆడిన మొదటి ఆటగాడు కూడా ఆయనే.

విరాట్ కోహ్లీకి మొదటి కెప్టెన్

మిథున్ మన్హాస్ పేరు వినగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది ఆయన ఢిల్లీకి సారథ్యం వహించిన సమయం. ఆయన 2007-08లో ఢిల్లీ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో ఒక కీలక సభ్యుడు. ఈ సమయంలోనే విరాట్ కోహ్లీ తన దేశవాళీ కెరీర్‌ను ప్రారంభించారు. కోహ్లీ ఆడిన మొదటి రంజీ ట్రోఫీలో మన్హాస్ ఢిల్లీ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. యువ ఆటగాడిగా కోహ్లీ ప్రయాణం మన్హాస్ సారథ్యంలోనే మొదలైంది. కోహ్లీ అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగిన తర్వాత కూడా మన్హాస్‌ను ఆయన మొదటి ఢిల్లీ కెప్టెన్‌గా గౌరవిస్తూ ఉంటారు.

రిటైర్ అయిన తర్వాత మన్హాస్ ఐపీఎల్‌లో పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లకు సహాయ కోచ్‌గా పని చేశారు. అలాగే జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ పదవిలో కూడా ఉన్నారు. క్రికెట్ పరిపాలనలో ఆయనకు ఉన్న అనుభవం, ఆటగాడిగా, కోచ్‌గా ఆయనకు ఉన్న విస్తృత పరిజ్ఞానం వల్ల ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవికి అర్హత సాధించారు.

ఇటీవల ఢిల్లీలోని ఓ కేంద్ర మంత్రి నివాసంలో బీసీసీఐ ఎన్నికలపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవ్జిత్ సైకియా, సంయుక్త కార్యదర్శి రోహన్ దేశాయ్, కోశాధికారి ప్రభ్తేజ్ సింగ్ భాటియాతో పాటు ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమల్ పాల్గొన్నారు. వీరితో పాటు సౌరాష్ట్ర నుండి మాజీ బీసీసీఐ కార్యదర్శి నిరంజన్ షా, మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ తరఫున తమిళనాడు నుండి కాశీ విశ్వనాథన్, ఐపీఎల్ పాలక మండలి మాజీ ఛైర్మన్, కర్ణాటకకు చెందిన బ్రిజేష్ పటేల్ వంటి సీనియర్లు కూడా హాజరయ్యారు.

క్రిక్ బజ్ నివేదిక ప్రకారం.. రాజీవ్ శుక్లా, దేవ్జిత్ సైకియా, ప్రభ్తేజ్ సింగ్ భాటియా, రోహన్ దేశాయ్ తమ పదవుల్లో అలానే కొనసాగుతారని తెలుస్తోంది. అరుణ్ సింగ్ ధుమల్ పరిస్థితి మాత్రం అస్పష్టంగా ఉంది. ఆయన ఐపీఎల్ ఛైర్మన్‌గా కొనసాగుతారా? లేదా? అనే విషయంపై కొంత గందరగోళం ఉంది. కూలింగ్-ఆఫ్ కాలం ఆయనకు వర్తిస్తుందా? లేదా? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్! - Tholi Paluku