Let's talk: editor@tmv.in
బళ్లారిలో ఉద్రిక్తత: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం

బళ్లారిలో ఉద్రిక్తత: గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం

Dantu Vijaya Lakshmi Prasanna
3 జనవరి, 2026

బళ్లారిలో జనవరి 3న జరగనున్న మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి నగరవ్యాప్తంగా బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు, గాలి జనార్దన్ రెడ్డి నివాసం ఉండే హవంబభావి ప్రాంతంలో ఫ్లెక్సీలు కట్టడానికి ప్రయత్నించారు. దీనిని జనార్దన్ రెడ్డి మద్దతుదారులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది. బ్యానర్ల ఏర్పాటు విషయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణలకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి సహా పలువురిపై పోలీసులు నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. గురువారం జరిగిన ఈ ఘర్షణల్లో ఒకరు మరణించగా, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, బీజేపీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు మద్దతుదారులకు, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి, ఆయన మద్దతుదారుడు సతీష్ రెడ్డి వర్గీయులకు మధ్య ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో వాగ్వాదం మొదలైంది. ఇది కాస్తా ముదిరి పరస్పరం రాళ్ల దాడికి, కాల్పులకు దారితీసింది. రాజశేఖర్ రెడ్డికి తగిలిన బుల్లెట్ పోలీసుల తుపాకీ నుండి రాలేదని, అది ప్రైవేట్ ఆయుధం నుండి వచ్చిందని ఎస్పీ రంజిత్ కుమార్ తెలిపారు. నమోదైన కేసుల వివరాలు చూస్తే, రాజశేఖర్ రెడ్డి మృతిపై హత్య కేసు. సతీష్ రెడ్డి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు. జనార్దన్ రెడ్డిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు. ఘటనలో పాల్గొన్న అందరిపై పోలీసులు స్వయంగా సుమోటోగా ఒక కేసు నమోదు చేశారు.

హత్యాయత్నం ఆరోపణలు - కాల్పుల కలకలం

గాలి జనార్దన్ రెడ్డి తనపై హత్యాయత్నం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. భరత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సతీష్ రెడ్డి అక్కడికి చేరుకుని, ఒక గన్‌మన్‌ నుంచి తుపాకీ లాక్కుని తనపైకి కాల్పులు జరిపాడని జనార్దన్ రెడ్డి ఆరోపించారు. సుమారు 4 నుండి 5 రౌండ్ల కాల్పులు జరిగాయని, తాను తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నానని ఆయన పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా ఘటనా స్థలంలో దొరికిన బుల్లెట్ షెల్స్‌ను ఆయన మీడియాకు చూపించారు. భరత్ రెడ్డి, ఆయన తండ్రి సూర్యనారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి కలిసి తనను చంపేందుకు ముందే ప్లాన్ చేశారని జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

ఈ హింసాత్మక ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో భరత్ రెడ్డి మద్దతుదారుడైన రాజశేఖర్ రెడ్డి (26) అనే యువకుడు బుల్లెట్ గాయంతో మరణించాడు. అయితే ఈ బుల్లెట్ ఎవరి తుపాకీ నుంచి వచ్చిందనేది ఇంకా విచారణలో ఉంది (పోలీసులు ఇది 'ప్రైవేట్ ఆయుధం' అని ప్రాథమికంగా నిర్ధారించారు). సతీష్ రెడ్డికి గాయాలయ్యాయి. రాళ్ల దాడిలో భరత్ రెడ్డి వర్గీయుడు సతీష్ రెడ్డికి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుత పరిస్థితి:

బళ్లారిలో ఉద్రిక్తత దృష్ట్యా 144 సెక్షన్ విధించారు. ఏడిజిపి హితేంద్ర నేతృత్వంలో విచారణ జరుగుతోంది. ఇప్పటివరకు ఐదు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టు కోసం సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బళ్లారిలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, భారీగా పోలీసు బలగాలను మోహరించామని అధికారులు తెలిపారు. తుపాకి లైసెన్స్ నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరుపుతున్నారు. గాలిలోకి కాల్చిన బుల్లెట్ రాజశేఖర్ రెడ్డికి తగిలి ఆయన మరణించారని, అసలు ఎవరి తుపాకీ నుండి కాల్పులు జరిగాయో తేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశించారు. పెద్ద వ్యక్తుల పేర్లు ఉన్నందున లోతైన విచారణ తర్వాతే అరెస్టులు చేస్తామని ఏడీజీపీ (శాంతి భద్రతలు) ఆర్. హితేంద్ర స్పష్టం చేశారు.

హోం మంత్రి జి. పరమేశ్వర కూడా ఈ ఘటనపై నివేదిక కోరారు. దావణగెరె, చిత్రదుర్గ, కొప్పల్ జిల్లాల నుండి అదనపు బలగాలను రప్పించి బందోబస్తు ఏర్పాటు చేశారు.