
బలవంతపు ఏకగ్రీవాల రద్దు.. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఉపసంహరణలు, వేలంపాటల ద్వారా ఏకగ్రీవాలు జరుగుతున్నాయని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. బలవంతపు ఏకగ్రీవాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేస్తూ, అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని నిబంధన 15 ప్రకారం, ఒక స్థానంలో ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీలో ఉన్నప్పుడే ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే ఆ ఏకగ్రీవం గ్రామస్తులను ప్రలోభపెట్టడం, బెదిరించడం లేదా మోసం చేయడం వంటి దుశ్చర్యలు లేకుండా స్వచ్ఛందంగా జరగాలని ఈసీ స్పష్టం చేసింది.
ఏకగ్రీవాలపై వచ్చే ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. వేలంపాటలు, బెదిరింపులు, ప్రలోభాలు వంటి దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను లిఖితపూర్వకంగా, మౌఖికంగా, వాట్సాప్ ద్వారా లేదా వార్తాపత్రికల క్లిప్పింగ్‌ల రూపంలో కూడా ఈ విభాగానికి తెలియజేయవచ్చు.
ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి
నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థుల నుంచి స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నట్లు, ఎలాంటి భయం, బెదిరింపు లేదా ఆర్థిక ప్రేరణకు గురికాలేదని ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. పోటీలో మిగిలిన ఏకైక అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం ధన బలం, వేలంపాట, బెదిరింపులు ఉపయోగించలేదని ధ్రువీకరించే పత్రాన్ని తీసుకోవాలి. తప్పుడు సమాచారం ఇస్తే తన ఎన్నిక రద్దు అవుతుందని అంగీకరించాలి.
నామినేషన్ ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారి ఫలితాన్ని జిల్లా కలెక్టర్ (డీఈఏ)కు పంపాలి. డీఈఏ ఫిర్యాదులు లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని ప్రకటించడానికి 'క్లియరెన్స్' ఇవ్వాలి. ఈ ప్రక్రియ ఉపసంహరణ గడువు ముగిసిన అదే రోజులో పూర్తి కావాలి. గ్రామంలో ఎన్నికల వాతావరణం దెబ్బతిన్నట్లుగా విశ్వసనీయమైన ఫిర్యాదు అందితే, పర్యవేక్షణ విభాగం 24 గంటల్లోపు విచారణ జరిపి, అవసరమైతే ఆ గ్రామ పంచాయతీలోని ఎన్నికను రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఈసీకి నివేదిక పంపాలి. ఏకగ్రీవాల పేరుతో జరిగే అక్రమాలను నివారించి, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలను నిర్వహించడమే ఈ కొత్త మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం అని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 25న గ్రామ పంచాయతీ ఎన్నికలకు మూడు దశల షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 12,728 సర్పంచ్ స్థానాలు, అలాగే 1,12,242 వార్డు సభ్యుల స్థానాల కోసం ఈ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.66 కోట్ల మంది గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సూచించిన తేదీలలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై అదే రోజు ఫలితాలు వెలువడతాయి.
