
బాలల నాటికల పోటీలు
తొలిపలుకు, అమరావతి, గుంటూరు:* ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్రప్రదేశ్, ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రానున్న ‘3వ ప్రపంచ తెలుగు మహా సభలు అమరావతి, గుంటూరు 2026’ సన్నాహాల్లో భాగంగా 8 నుంచి 15 సంవత్సరాల వయసులోపు ఉన్న వారికి జాతీయ స్థాయి బాలల లఘు తెలుగు నాటికల ప్రదర్శన పోటీలను 5 నవంబర్ 2025 ఉదయం 9 గంటలకు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన కేంద్రం, గుంటూరులో నిర్వహించనున్నట్లు పరిషత్తు అధ్యక్షుడు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ పోటీలకు సంచాలకుడిగా అభినయ శ్రీనివాస్, మానాపురం సత్య నారాయణలు వ్యవహరిస్తారని డా.శ్రీనివాస్ తెలిపారు.
నాటిక నిడివి 15నిమిషాలు
ఈ పోటీలలో పాల్గొనేవారు విద్యాలయాల తరఫు నుండి గానీ, సాంస్కృతిక సంస్థల నుండి గానీ ఎంట్రీలు పంపించవచ్చు. నాటిక నిడివి 15 నిమిషాలు మాత్రమే వుండాలి. నాటిక స్క్రిప్ట్‌ను అక్టోబర్ 15 కల్లా 83310 20896 వాట్సాప్ నంబర్‌కు పీడీఎఫ్ ద్వారా పంపాలి. ఎన్నిక అయిన నాటికల వివరాలను నేరుగా సంస్థలకు తెలియజేస్తారు. జాతీయ సమైక్యతకు భంగం వాటిల్లే అంశాలు, సంభాషణలు ఉండరాదు. వేదిక, లైటింగ్, సౌండ్ సిస్టమ్ సదుపాయాలు నాటిక ప్రదర్శనకు అందజేయబడతాయి.
ప్రథమ బహుమతి రూ.10వేలు
ప్రదర్శనకు అర్హత సాధించి ప్రదర్శించిన నాటికకు అభినందన ప్రశంసా పత్రం, పాత్రదారులకు అభినందన పతకములు, ప్రశంసా పత్రం అందజేయబడతాయి. ప్రదర్శన రోజు భోజన, అల్పాహార ఏర్పాట్లు చేయబడతాయి. ప్రథమ బహుమతి: రూ.10 వేలు, పతకం, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందిస్తారు. ద్వితీయ బహుమతి రూ.7,500, జ్ఞాపిక, పతకం, ప్రశంసా పత్రం, తృతీయ బహుమతి రూ.5 వేలు పతకం, జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారు. అలాగే మూడు ప్రత్యేక బహుమతులు, అభినందన పత్రాలు అందజేస్తారు. నటులకు వ్యక్తిగత ప్రతిభా బహుమతులు ఉంటాయి. విజేతలకు ప్రపంచ తెలుగు మహా సభలలో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని ముఖ్య సమన్వయకర్తలు పి.రామచంద్ర రాజు, వి.విద్యాసాగర్‌లు తెలిపారు.
